ఆది పినిశెట్టి.. నిక్కీ గల్రానీ ఇటీవల ప్రేమించి పెళ్లి చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ లవ్ స్టోరీ గురించి.. ఇప్పటి వరకూ ఎలాంటి విషయాలూ బయటకు రాలేదు. తొలిసారి తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పుకొచ్చాడు ఆది పినిశెట్టి.
”మలుపు సినిమాలో ఇద్దరం తొలిసారి నటించాం. అప్పటికి మా మధ్య స్నేహం కూడా లేదు. నిజం చెప్పాలంటే కమ్యునికేషన్ గ్యాప్ వల్ల.. ఎడమొహం పెడమొహంలా ఉండేవాళ్లం. ఎవరి దారి వాళ్లదే అన్నట్టు ప్రవర్తించేవాళ్లం. ఆ సినిమా పూర్తయ్యేసరికి.. మామధ్య స్నేహం చిగురించింది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. లవ్ విషయం ముందు తనే ప్రపోజ్ చేసింది. నేనే కొంత కాలం సమయం అడిగాను. తను నాకు సూటవుతుందా? మేమిద్దం కలిసి జర్నీ చేయగలమా? ఇలాంటి చాలా లెక్కలు వేసుకొన్నాను. ఆ తరవాత.. తనే నాకు కరెక్ట్ అనిపించింది. ఇంట్లో చెప్పాను. పెద్దగా ప్రతిఘటించలేదు. నా నిర్ణయానికి విలువ ఇచ్చారు. అలా… పెళ్లి చేసుకొన్నాం. పెళ్లయ్యాక కూడా తను సినిమాలు చేస్తుంది. అది పూర్తిగా తన ఇష్టం. నేనేం బలవంతం చేయట్లేదు. సినిమాలు మానేస్తానన్నా తన ఇష్టమే” అనిచెప్పుకొచ్చాడు ఆది.
తను విలన్ గా నటించిన `వారియర్` ఈ శుక్రవారమే విడుదలైంది. ఈసినిమా ఫలితంపై, తన పాత్రకు వస్తున్న స్పందనపై ఆది సంతృప్తి కరంగానే ఉన్నాడు. ”సరైనోడు తరవాత.. విలన్గా చాలా కథలొచ్చాయి. అయితే అవేం నాకు సంతృప్తిగా అనిపించలేదు. లింగుస్వామి చెప్పిన `వారియర్` కథొక్కటే నాకు నచ్చింది. విలన్ పాత్రకు ఉన్న బ్యాక్ స్టోరీకి కనెక్ట్ అయ్యాను. అందుకే ఈ సినిమా ఒప్పుకొన్నా. హీరో, విలన్ అనే తేడా ఏం లేదు. ఏ పాత్ర నాకు పేరు తీసుకొస్తుందో, ఆ పాత్రలో నేను కనిపిస్తా” అని చెప్పుకొచ్చాడు ఆది పినిశెట్టి. తెలుగులో కొత్త గా రెండు ప్రాజెక్టులు ఒప్పుకొన్నాడట. తమిళంలో హీరోగా మూడు సినిమాలు చేస్తున్నాడు ఆది పినిశెట్టి.