తమకు 90 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది కానీ తాము ముందస్తుకు వెళ్లే ప్రశ్నే లేదని కేటీఆర్ చెబుతున్నారు. రెండు రోజులుగా వచ్చిన సర్వే ఫలితాల అంశంపై మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసిన ఆయన.. ఆ సర్వేలన్నీ ప్రతిపక్షాలు చేయించుకున్నవని వాటిలోనూ తాము గెలుస్తామని తేలిందన్నారు. తాము సీట్లు గెలుస్తామని కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని అంటున్నారు.
తమ ఒక్క పార్టీనే రాష్ట్రం మొత్తం ఉందన్నారు. కేసీఆర్ ఎవరికీ బెదరడు.. లొంగడు అని కేటీఆర్ తేల్చిచెప్పారు. వాపును చూసి కొందరు బలుపు అనుకుంటున్నారని విశ్లేషించారు. తాము అసెంబ్లీని రద్దు చేస్తామని చెప్పలేదని.. బీజేపీ వాళ్లు తేదీ ప్రకటిస్తే అసెంబ్లీ రద్దు చేస్తామని సీఎం చెప్పారు. కానీ బీజేపీ నుంచి స్పందన లేదన్నారు కేటీఆర్. అన్ని వ్యవస్థలతో పాటు ఈసీ కూడా కేంద్రం చేతిలో ఉందన్నారు.
తెలంగాణలో పలు సంస్థలు రోజుకో సర్వేను వెలువరిస్తున్న సందర్భంలో కేటీఆర్ తమ సర్వే గురించి చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. తమకు 90 స్థానాలు వస్తాయని కేటీఆర్ చెబుతున్నారు. టీఆర్ఎస్కు ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ టీం సేవలు అందిస్తోంది. వారే సర్వేలు చేస్తున్నారు. అయితే కేటీఆర్ తమపై ప్రజాగ్రహం ఉందని పరోక్షంగా అంగీకరిస్తున్నారు.
కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇస్తామని ఆయన చెబుతున్నారు. చాలా కాలంగా కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయడం లేదు. అలాగే ధరణి పెద్ద సమస్యగా మారింది. దానిలోనూ మార్పులు చేస్తామని చెబుతున్నారు.
పలు సర్వేల్లో టీఆర్ఎస్ మొదటి స్థానంలోఉంటుందని తేలుతున్నా… గెలుపుపై మాత్రం ధీమా వ్యక్తం కావడం లేదు. కేటీఆర్ మాటల్లోన మునపటి ధీమా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.