ఏపీలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. జీతాలు పెంచమని వారు డిమాండ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నిజానికి వారు జీతాలు పెంచమని డిమాండ్ చేయడం లేదు. గతంలో ప్రకటించిన మేరకు జీతాలివ్వాలంటున్నారు. గతంలో వారికి హెల్త్ అలవెన్స్ ఉండేది. వాటిని తీసేశారు. పద్దెనిమిది వేల జీతం అని ప్రకటించారు. ఇప్పుడు పదిహేను వేలు ఇస్తున్నారు. వివిధ కారణాలు చూపి కట్ చేస్తున్నారు. చివరికి తమ జీతం సాధారణ స్థాయిలో ఇవ్వాలని వారు వేడుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. ఇప్పుడు రూ. పదిహేను వేల జీతం.. నిలిపివేసిన హెల్త్ అలవెన్స్ రూ. ఆరు వేలు కలిపి రూ. ఇరవై ఒక్క వేలు ఇస్తాం పండగ చేసుకోండని మంత్రి చెబుతున్నారు.
దీంతో కార్మికులు బతుకుజీవుడా అనుకునే పరిస్థితి. ఇది కూడా ఇస్తారా లేకపోతే తర్వాత కొర్రీలు పెడతారా అన్నది చూడాలి. కానీ ఇందులో ప్రభుత్వం కొత్తగా ఇచ్చేదేమీలేదు. గతంలో ఉన్న వాటిని నిలిపివేసి ఇప్పుడు సమ్మె చేస్తే అదే మళ్లీ ఇస్తామంటున్నారు. ఖచ్చితంగా ఉద్యోగుల విషయంలోనూ అదే వ్యూహం పాటించారు. ఉద్యోగుల ప్రయోజనాలన్నింటినీ రద్దు చేసేసి.. చివరికి తమకు జీతాలు పెంచవద్దు.. తమ ప్రయోజనాలు పునరుద్ధరిస్తే చాలని వేడుకునే వరకూ పరిస్థితి తెచ్చారు. వేడుకున్నారు. కొన్ని తిరిగి ఇచ్చారు. కొన్ని ఈ సారి ఎప్పుడైనా ఆందోళన చేస్తే తిరిగి ఇస్తారు.
అయితే ప్రభుత్వం మరీ కనికరం లేకుండా.. ఇలా పారిశుద్ధ్య కార్మికులపైనా ఇలాంటి వ్యూహం అమలు చేయడం ఏమిటనేదే కొంత మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. వారికి చేయాల్సిన మేలు చేయాలి కానీ.. ఏదో చేస్తున్నట్లుగా చెప్పడానికి వారిని టెన్షన్ పెట్టి.. ప్రయోజనాలు తీసేసి..మళ్లీ ఇచ్చి.. తామే ఇచ్చినట్లుగా చెప్పుకోవడానికి వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకనేది ఎక్కువ మందికి వస్తున్న సందేహం. అదే రాజకీయం అనుకోవాలేమో !