కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు ఉచితంగా పంపిణీ చేయడానికి కేంద్రం బియ్యం ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు గురువారం నుంచి నిరసనలు కూడా ప్రారంభించారు. అయితే బీజేపీ నేతలకు నిరసనలు చేయాల్సినంత అవసరం ఏమిటనేది ఎక్కువ మందికి వచ్చే డౌట్. కేంద్రం పేదలకు ఇవ్వాలని బియ్యం పంపితే రాష్ట్రం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధం. అది కేంద్రాన్ని మోసం చేయడమే. ప్రజలనూ మోసం చేయడమే. అలాంటప్పుడు బీజేపీ నేతలు ఏం చేయాలి. తక్షణం కేంద్రానికి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలి.
బియ్యం పేదలకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలి. కానీ గల్లీలో రోడ్లపై ధర్నాలు చేస్తే వచ్చే లాభం ఏముంది. రాజకీయంగా కూడా నష్టమే. ప్రజలు కూడా అదే ఆలోచిస్తారు. కేంద్రంలో ఉంది బీజేపీనే కదా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని. గత రెండు, మూడు నెలల నుంచి ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. కేంద్రం తమ దగ్గర ఉన్న జాబితా ప్రకారం బియ్యం కోటా పంపుతుంది. కానీ రాష్ట్ర జాబితాలో రేషన్ కార్డులు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి వారి సంఖ్య దాదాపుగా నలభై శాతం ఎక్కువ.
ఒక వేళ కేంద్రం పంపే ఉచిత బియ్యం పంపిమీ చేయాలంటే… రాష్ట్రం మరో నలభై శాతం మందికి తాము ఖర్చు పెట్టుకుని పంపిణీ చేయాల్సి ఉంటుంది. అందుకే కేంద్రం బియ్యం కోసం పంపే నిధులను అట్టేపెట్టేసుకుంటోంది. పంపకాలు చేయడం లేదు. బీజేపీ నేతలు తల్చుకుంటే దీనిపై చర్యలు తీసుకోవడం ఒక్క రోజు పని. కానీ బీజేపీ నేతలు ధర్నాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.