గ్రామాల్లోకి వెళ్లినప్పుడు తాజ్ మహల్ టీ ప్యాకెట్ కొంటాం. కానీ అది తాజ్ మహల్ టీ ప్యాకెట్ కాదు. ఓ స్పెల్లింగ్ మిస్టేట్‌తో అచ్చం అలాగే కనిపించే డూప్లికేట్ బ్రాండ్. గ్రామాల్లో అత్యధికం ఇలాంటి బ్రాండ్లే అమ్ముతూంటారు. అచ్చంగా ఇదే ఫార్ములాను ఏపీ ప్రభుత్వం మద్యం విషయంలో పాటిస్తోంది. పాపులర్ బ్రాండ్ల రూపంలో ఉండేలా నకిలీ బ్రాండ్లను అమ్ముతోంది. తాజాగా రేపల్లెలో ఇద్దరు వృద్దులు చనిపోవడానికి కారణం అని భావిస్తున్న మద్యంలో రెండు బ్రాండ్లు.. పాపులర్ బ్రాండ్లను పోలి ఉన్నాయి. కానీ అవి అసలైనవి కావు.
ప్రభుత్వానికి మద్యం సరఫరా చేస్తున్న కంపెనీల సొంత బ్రాండ్ల. కాస్త పేరు మార్పుతో వాటిని అమ్మేందుకు ప్రభుత్వం అనుమతించింది. తాగుబోతుల్ని అలా మోసం చేస్తున్నారు. ఏపీ మద్యం దుకాణంలోకి వెళ్లి వరుసగా అక్కడ పేర్చి ఉన్న మద్యం సీసాల్ని.. వాటి ప్యాకింగ్‌ను చూస్తే .. అవన్నీ పాపులర్ బ్రాండ్లేనన్న నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే వాటి ప్యాకింగ్.. రూపం .. పేర్లు అన్నీ దాదాపుగా ఒకే మాదిరిగా ఉంటాయి. కానీ అసలు సరుకు మాత్రం నకిలీ. ఇలాంటి నకిలీల్ని అరికట్టాల్సిన ప్రభుత్వమే అధికారికంగా ఈ వ్యాపారం చేస్తోంది.
అందుకే ఏ ఒక్కరూ నోరు మెదపలేకపోతున్నారు. ఆయా బ్రాండ్ల కంపెనీలు కూడా నోరు తెరవలేకపోతున్నాయి. కానీ ప్రజలు మాత్రం వాటిని తాగి బలైపోతున్నారు. వెంటనే కాకపోయినా ఆ మద్యం తాగిన వారికి క్రమంగా ఆరోగ్యం క్షీణిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ల్యాబ్ రిపోర్టులు బయట పెట్టిన బ్రాండ్లు ఆపేస్తున్నారు. కానీ అదే సరుకుకు వేరే బ్రాండ్ పేరు తగిలించి రిలీజ్ చేస్తున్నారు.