దర్శకుడుహను రాఘవపూడి పదికాలాలు గుర్తుపెట్టుకొనే ఒక అందమైన ప్రేమకథని చూపించాలానే లక్ష్యం పెట్టుకున్నట్లుగా వుంది సీతారామం నుండి వస్తున్న పాటలని చూస్తుంటే. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆల్బం ఇప్పటికే మెలోడీ లవర్స్ ని అలరించింది ‘ఓ సీతా- హే రామా’, ఇంతందం” పాటలు మనసుని హత్తుకునేలా వున్నాయి. ఈ చిత్రం నుండి మూడో పాట కానున్న కళ్యాణం ఏమన్నది ? ప్రోమో బయటికి వచ్చింది. దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల రాసిన పాటిది. పాట, సాహిత్యం హృద్యంగా అనిపించాయి.
కానున్న కళ్యాణం ఏమన్నది ?
స్వయంవరం మనోహరం
రానున్న వైభోగం ఎటువంటిది ?
ప్రతి క్షణం మరో వరం
విడువని ముడి ఇది కదా
ముగింపు లేని గాధగా
తరముల పాటుగా తరగని పాటగా
ప్రతి జత సాక్షిగా ప్రణయమునేలగా సదా..
పాటకు సిరివెన్నెల కలం పలికించిన ఈ సాహిత్యం పాటలానే చాలా మనోహరంగా వుంది. పాట చిత్రీకరణ కూడా సిరివెన్నెల కురిసినట్లుగా చాలా అందంగా చేశారు. మంచు కొండల్లో తెల్లని చీరకట్టుకొని అప్సరసలు నృతం చేస్తున్నట్లు విజువల్ వండర్ క్రియేట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఇంత మెలోడి సాహిత్య ప్రధానమైన ఆల్బమ్ సీతారామం కావడం విశేషం.