ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు డబ్బులు పంచడం ప్రభుత్వ విధి కాదు. సరే పంచితే పంచారు కానీ మౌలిక సదుపాయాలను పక్కన పెట్టేయడం ప్రభుత్వం తన బాధ్యతల్ని విస్మరించడమే. ఏపీలో అదే జరుగుతోంది. ఏపీలో రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. రోడ్డెక్కిన ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. సొంత పార్టీ నేతలూ ధర్నాలు చేస్తున్నారు. మూడేళ్లుగా చెప్పిందే చెప్పి.. చెప్పిందే చెప్పి మాట మారుస్తున్నారు కానీ రోడ్లను మాత్రం బాగు చేయలేదు. రోడ్ల పేరుతో లీటర్కు రూపాయి చొప్పున సెస్ పిండుతున్నారు కానీ ఆ సొమ్మెటు పోతుందో ఎవరికీ తెలియదు.
విపక్షాలు విమర్శలు.. ఉద్యమాలు చేస్తున్నాయి. సరే మనం పాలకులం కాబట్టి వాళ్లను పురుగుల్లాగా చూద్దాం.. వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటే్ పోయేదేం లేదు. కానీ మన పాలన తీరు ఎలా ఉందో ఆ రోడ్లు బయట పెడుతున్నాయి కదా… సిగ్గని ఎందుకనిపించడం లేదు ? కనీసం రోడ్లకు మరమ్మతు చేయలేనంత దారుణమైన పాలన అందిస్తున్నామని ఎందుకు చిన్నబోవడం లేదు ..? మీడియాలో వస్తున్న వార్తలు… సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.. అంతా ఉత్తదే అని చెబితే జనాలు నమ్మేస్తారా ? ఒక్క సారి రోడ్ల మీదకు వెళ్లే ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది కదా . రోడ్లు బాగున్నాయో లేవో వారికి తెలియదా ? ఓట్లు వేసేది వాళ్లు కాదా ?
ప్రభుత్వం తన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలమయింది. ఈ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేయడమే అసలు విషాదం. ఏదైనా పొరపాటున జరిగితే సరే అనుకోవచ్చు. కానీ ఇక్కడ రోడ్ల నిర్వహణ అవసరం లేదు.. రోడ్లను మెరుగ్గా ఉంచాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే అనుకుంటోంది. ఫలితమే ఈ దుర్భర రోడ్ల పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ప్రజలే కళ్లు తెరిపించాలి.. లేకపోతే ప్రభుత్వాల బాధ్యతల్నీ ప్రజలే నెత్తికెత్తుకుని రోడ్లు బాగు చేసుకోవాలి.