కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్ నేతలపై పోటాపోటీ ఆపరేషన్ ఆకర్ష్‌లు ప్రయోగిస్తున్నాయి. బీజేపీ తరపున ఈటల రాజేందర్ బాధ్యత తీసుకుంటే .. కాంగ్రెస్ బాధ్యతను స్వయంగా రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. వరుసగా పార్టీ నేతల్ని చేర్చుకుంటూ వెళ్తున్నారు. లైనప్‌ను కూడా పక్కాగా రెడీగా పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఓ జడ్పీ చైర్మన్‌ను తమ పార్టీలో చేర్చేసుకున్న రేవంత్ .. టీఆర్ఎస్పై రగిలిపోతున్న మరో ముగ్గురు జడ్పీ చైర్మన్ కుటుంబాలతో చర్చలు పూర్తి చేశారు.
రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జడ్పీ చైర్మన్ పీఠాలు పొందిన కుటుంబాలకు తమకు రాజకీయ ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తిలో ఉన్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు టిక్కెట్ హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నారు.. ఈ కారణంగా వారు తమకు టిక్కెట్లు రావని భావిస్తున్నారు. అందుకే పక్క చూపులు చూస్తున్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఆయన భార్య వికారాబాద్ జడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన పార్టీ మారితే రేవంత్ రెడ్డి గొప్ప విజయం సాధించినట్లే. గత ఎన్నికల్లో రేవంత్‌ను ఓడించడానికి భారీగా ఖర్చు పెట్టి తన సోదరుడి కోసం పని చేసింది మహేందర్ రెడ్డినే. రేవంత్‌తో పాటు మహేందర్ రెడ్డి కూడా ఓడిపోయారు.
ఇక తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస ్వైపు చూస్తున్నారు . సబితారెడ్డిని టీఆర్‌ఎ్‌సలో చేర్చుకోవడాన్ని తీగల మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అసంతృప్తితో ఉన్న తీగలను బుజ్జగించేందుకు ఆయన కోడలు అనితారెడ్డికి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే తీగల వచ్చే ఎన్నికల్లో పోటీ లక్ష్యంతో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మేడ్చల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి తనయుడు మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్నారు. కానీ మంత్రి మల్లారెడ్డితో పొసగక గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
వీరితో కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు బీజేపీ కూడా సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే విశ్వేశ్వర్ రెడ్డిని చేర్చుకున్నారు. మిగిలిన వారికీ ఆహ్వాాలు ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే టీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు కానీ ఇతరులు టీఆర్ఎస్ వైపు చూసే పరిస్థితి లేకుండా పోయింది.