టాలీవుడ్లో తిరుగులేని దిల్ రాజుకు బాలీవుడ్ లో రెండు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. `జెర్సీ`, `హిట్` రీమేకులు రెండూ ఫ్లాప్ అయ్యాయి. దాంతో… బాలీవుడ్ దిల్ రాజుకి కలిసిరాలేదని అంతా అనుకొన్నారు. కానీ.. దిల్ రాజు ఈ రెండు సినిమాల అసలు లెక్కలు బయట పెట్టారు. ఈ రెండు సినిమాల వల్లా.. తాను నష్టపోలేదని అసలు విషయం చెప్పుకొచ్చారు.
”జెర్సీ మొదలెడుతున్నప్పుడు ఆ సినిమా వల్ల టేబుల్ ప్రాఫిట్ రూ.30 కోట్ల వరకూ వస్తుందనుకొన్నాం. ఆ తరవాత పాండమిక్ వచ్చింది.. 30 కోట్లు కాదుగానీ., 20 కోట్లు వస్తే చాలు అనుకొన్నాం. ఆ తరవాత పదికి పడిపోయింది. ఆ తరవాత.. `మా డబ్బులు మాకొస్తే చాలు` అనే స్థితికి చేరుకొన్నాం. థియేటర్ల దగ్గర ఆ సినిమా ఫ్లాప్. కానీ అదృష్టం బాగుండి… 3-4 కోట్ల స్వల్ప నష్టాలతో బయటపడ్డాం. `హిట్`కి కూడా అంతే. తొలి రోజు కోటి రూపాయలు వచ్చాయి. రెండోరోజు.. కోటిన్నర వచ్చింది. మూడో రోజు ఇంకాస్త పెరిగింది. ఎటు చూసినా.. తొలి మూడు రోజుల్లో రూ.4 కోట్లు వచ్చినట్టు. అదే.. పాండమిక్ ముందు ఈ సినిమా రిలీజ్ చేసి ఉంటే, తొలి మూడు రోజుల్లో కనీసం రూ.15 కోట్లు వచ్చేవి. ఆ మేరకు మేం నష్టపోయాం. కానీ… శాటిలైట్, డిజిటల్, ఓటీటీ వల్ల.. `హిట్` సినిమాని లాభాలతో ముగించాం” అని లెక్కలన్నీ బయటకు తీశారు. ఓ రకంగా.. ఈ రెండు సినిమాలూ ఓటీటీల వల్లే గట్టెక్కారన్నమాట.