సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో తాను చెప్పి నకార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అంటున్నారు. తన మాట ఆలకించి కేవలం పదిహేను మంది ఎమ్మెల్యేలు మాత్రమే గడప గడపకూ తిరుగుతున్నారని.. ఇంకో యాభై మంది కాస్త కష్టపడుతున్నారని. . కానీ మిగతా వాళ్లు తూ తూ మంత్రంగా చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. గతంలో ఈ కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించిన ఆయన ఈ సారి సమీక్ష చేశారు. రోజులో చాలా సేపు పార్టీ కార్యక్రమానికే కేటాయించి పిలిపించిన వారితో మాట్లాడారు.
ఈ మాటల్లో జగన్ అసహనం బయపడిందని చెబుతున్నారు. తాను చెప్పినట్లుగా చేయడం లేదని ఎమ్మెల్యేలపై ఆయన మండిపడుతున్నారని అంటున్నారు. గడప గడపకూ వెళ్లడం లేదని.. చుట్టేస్తున్నారని కొంత మందిపై విరుచుకుపడ్డారు. ఇంకా పధ్నాలుగు నెలలు మాత్రమే సమయం ఉందని.. అందరూ పని తీరు మార్చుకోకపోతే.. కటిన నిర్ణయాలు తీసుకుంటానని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. తన కోసం త్యాగం చేశారని…పక్కన పెట్లలేరని కొంత మంది అనుకుంటున్నారని ఈ సారి తాను అలాంటివేమీ పట్టించుకోనని అంటున్నట్లుగా చెబుతున్నారు. తనకు గెలిచేవారు ముఖ్యమని పనితీరు మార్చుకున్న వారికే టిక్కెట్లు వస్తాయని స్పష్టం చేశారు.
మరో ఆరు నెలలు చూస్తానని ఏమైనా మార్పు ఉంటే సరే లేకపోతే.. ప్రత్యామ్నాయం చూసుకుంటానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు తాము ఊళ్లలోకి వెళ్తూంటే.. జనం సమస్యల గురించి నిలదీస్తున్నారని వాపోవడంతో .. రూ. రెండు కోట్లు రిలీజ్ చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ హామీ ఇచ్చి మూడు నెలలు దాటుతోంది ఇంత వరకూ పైసా విడుదల కాలేదు. దీంతో వైసీపీ నేతలు ఎమ్మెల్యేలు కూడా జగన్ చెప్పినట్లుగా నిధులు వచ్చిన తర్వాత చేసుకోవచ్చని లైట్ తీసుకుంటున్నారు.