ఈమధ్య పాటలన్నీ, మాస్ బీట్తో హోరెత్తిపోతోంటే, వేసవికాలంలో పిల్లగాలిలా.. సేద తీరుస్తున్నాయి.. ‘సీతా రామం’ పాటలు. ఇప్పటి వరకూ విడుదలైన రెండు పాటలూ… మంచి మెలోడీలే. ఇప్పుడు ముచ్చటగా మూడో పాటొచ్చింది. ‘కానున్న కళ్యాణం ఏమన్నది..?` అంటూ సాగిన ఈ గీతం మరో క్లాసికల్ టచ్! దిగ్గజ గీత రచయిత సీతారామశాస్త్రి రాసిన పాట ఇది. ఆయన కలం వెంట… భావాలు ఎంత అలవోకగా పలుగుతాయో, ఎంత గమ్మత్తుగా పరిగెడతాయో.. ఈ పాటతో మరోసారి తేలిపోయింది. ఇది పాటలా లేదు. ప్రేయసీ ప్రియులు మనసు విప్పి మాట్లాడుకుంటున్నట్టు… ఓ ప్రశ్నకు.. సమాధానం చెబుతున్నట్టు, తమ హృదయాలు ఆవిష్కరించుకొన్నట్టు ఉంది.
కానున్న కళ్యాణం ఏమన్నది ? అని ఆమె అడిగితే…
స్వయంవరం.. మనోహరం – అంటూ అతను సమాధానం చెప్పాడు.
రానున్న వైభోగం ఎటువంటిది ? అని ఆ అమ్మాయి ఆరా తీస్తే…
ప్రతి క్షణం మరో వరం – అంటూ ఆ అబ్బాయి భరోసా ఇచ్చాడు.
”విడువని ముడి ఇది కదా
ముగింపు లేని గాధగా
తరముల పాటుగా తరగని పాటగా
ప్రతి జత సాక్షిగా ప్రణయమునేలగా సదా.. ” అంటూ ప్రతీ మాట హృద్యంగా.. మనోహరంగా సాగింది. పల్లవిలో అయితే.. సీతారాముడి కలం మరింత విజృంభించింది. ఈ పాటలోనే చెప్పినట్టు.. `ఇది తరముల పాటు తరగని పాటగా.’ అనిపిస్తోంది. మంచు కొండల్లో చిత్రీకరించిన ఈ పాట.. థియేటర్లో ఇంకెంత మనోహరంగా ఉండబోతోందో? విశాల్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి సింధూరి ఆలపించారు. ఆగస్టు 5న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.