సీఎం జగన్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ఆరు నెలలుగా చెబుతున్నారు. ఒక్కో నియోజకవర్గానికి రెండు కోట్లు ఇస్తామని చెప్పి ఆరు నెలలు దాటిపోయింది .. ఇంత వరకూ జీవో రాలేదు. ఎమ్మెల్యేలు ఎవర్నీ అడగలేరు. అడిగితే సమాధానం రాదు. అయితే గడప గడపకూ కార్యక్రమంపై సమీక్ష పేరుతో కనీసం ఓ అరగంట అయినా తమకు మాట్లాడే చాన్స్ వస్తున్న సమయంలో ఎమ్మెల్యేలు నిధుల గురించి ప్రస్తావిస్తున్నారు. ఆ సమయంలో సీఎం జగన్ హామీలు ఇస్తున్నారు. అధికారులేమో జీవో రావాల్సి ఉందంటారు. కొంత మంది కలెక్టర్ ఖాతాలో ఉన్నాయంటారు. కానీ నిధులు మాత్రం విడుదల కాలేదు.
తాజాగా సీఎం జగన్ సచివాలయానికి రూ. 20 లక్షల చొప్పున నిధులు విడుదల చేస్తానని ప్రకటించారు. ప్రతి రెండు వేల మంది జనాభాకు ఓ సచివాలయం ఉంది. ఈ లెక్కన అసెంబ్లీ నియోజకవర్గంలో వందకుపైగా సచివాలయాలు ఉంటాయి. అంటే.. కనీసం ఇరవై కోట్ల వరకూ వస్తాయి. ఈ ఇరవై కోట్లకు.. తమకు ఇచ్చే రెండు కోట్లు అదనం. అంటే ఇరవై రెండు కోట్ల రూపాయలు నియోజకవర్గానికి ఇస్తామని జగన్ అంటున్నారని.. ఇంత కంటే గొప్ప చాన్స్ ఏముటుందని ఎమ్మెల్యేలు సంతోషపడుతున్నారు. సచివాలయానికి రూ. 20 లక్షలు ఇవ్వాలనేది తన నిర్ణయం అని జగన్ చెప్పడంతో ఇస్తారని భావిస్తున్నారు.
అయితే మూడేళ్లుగా ఎమ్మెల్యేలకు పైసా నిధులు రాలేదు. నియోజకవర్గంలో అడుగుతున్న పనులు చేయలేకపోతున్నారు. అదే సమయంలో పార్టీ నేతలకు రావాల్సిన బిల్లులు రాలేదు. చాలా మంది సొంత ప్రభుత్వంపై కోర్టుకెళ్తున్నారు. వారి బిల్లులు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. అయితే వారికి ప్రబుత్వం ఎప్పటికప్పుడు షాకిస్తూనే ఉంది. ఆ నిధులే ఇవ్వని ప్రభుత్వం… తమకు మాత్రం కోట్లకు కోట్లు ఇస్తుందా అనే సందేహం వైసీపీ ఎమ్మెల్యేల్లో వెంటాడుతోంది. ఇస్తామని చెబుతున్నారే కానీ ఇవ్వడం అనేది ఉండటం లేదు.
ఎన్నికల సీజన్ దగ్గరకు వస్తోంది. ఇప్పుడు చెప్పినట్లుగా నిధులు మంజూరు చేయకపోతే.. నియోజకవర్గాల్లో చిన్న చిన్న పనులు కూడా చేయించలేని పరిస్థితి. అది తమకే కాదు పార్టీకి కూడా నష్టమని గుర్తు చేస్తున్నారు. ఆ విషయం హైకమాండ్‌కు తెలుసని.. నిధులివ్వకపోతే… తాము మాత్రం చేయగలిగిందేమీ లేదని తేల్చేస్తున్నారు.