వైసీపీ విషయంలో బీజేపీ ఎలా వ్యవహరించబోతోందన్నది ఢిల్లీలో కొద్ది కొద్దిగా క్లారిటీ వస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. వైసీపీని లెక్కలోకి తీసుకోవడం మానేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో వైసీపీకి ఘోర అవమానం జరిగింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కడ్ను బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది. నామినేషన్లో ప్రధాని కూడా పాల్గొన్నారు. ఇతర ఎన్డీఏ పార్టీలు పాల్గొన్నాయి. కానీ వైసీపీ ఎంపీల జాడ మాత్రం కనిపించలేదు.
వైసీపీ ఎంపీలు ధన్‌ఖడ్‌కు బీజేపీ అడగకుండానే మద్దతు ప్రకటించారు. ఆయన బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి అని సామాజిక న్యాయంలో భాగంగా మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. నిజానికి వైసీపీని మద్దతు బీజేపీ నేతలెవరూ సంప్రదించలేదు. కానీ ముందుగానే మద్దతు ప్రకటించారు. తమను రాష్ట్రపతి ఎన్నికల సమయంలో నామినేషన్‌కు పిలిచినట్లుగా పిలుస్తారని అనుకున్నారు. కానీ బీజేపీ వైపు నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. దాంతో వారు వెళ్లలేకపోయారు. మద్దతు ప్రకటించినా ఎందుకు మిమ్మల్ని బీజేపీ నేతలు నామినేషన్‌కు పిలువలేదంటే.. వైసీపీ ఎంపీలు నీళ్లు నమిలాల్సి వచ్చింది. విషయమేంటో వారికీ తెలియదు.
మద్దతు ఇస్తున్నందుకు వైసీపీ గొంతెమ్మ కోరికలు కోరుతోందని.. అది కూడా రాష్ట్రానికి సంబంధం లేని అంశాలు.. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలేనని అందుకే బీజేపీ హైకమాండ్ వైసీపీ విషయంలో వీలైనంత వరకూ దూరంగా ఉండాలని అనుకుంటోందని చెబుతున్నారు. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చినా ఇవ్వకపోయినా లెక్క చేయకూడదనుకున్నారు. ఒక వేళ బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోతే .. అది బీజేపీ కంటే వైసీపీకే తీవ్ర నష్టం. అందుకే వైసీపీకి మరో చాయిస్ లేదు. ఇప్పటి నుండి బీజేపీ నేతల లెక్క వైసీపీ విషయంలో మారుతుందని ప్రచారం జరుగుతోంది .