బీజేపీలో చిన్న స్థాయి కార్యకర్త నుండి అధ్యక్షుడి వరకూ.. ప్రజాప్రతినిధి.. దిగువస్థాయి నుంచి ఉపరాష్ట్రపతి వరకూ ఎదిగిన వెంకయ్యనాయుడు రాజకీయ ప్రస్థానం దాదాపుగా ముగిసినట్లే భావిస్తున్నారు. ఆయన వయసు ఇప్పుడు 73 ఏళ్లు. బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంటే. పార్టీలో కూడా ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. ఈ కారణంగా బీజేపీ ఉద్దండులన్నీ ఇంటికే పరిమితమయ్యారు. వారి జాబితాలో చివరిగా అయినా వెంకయ్యకు అనధికారిక రిటైర్మెంట్ ఇచ్చినట్లవుతోంది.
అయితే వెంకయ్యనాయుడు ఆరోగ్య పరంగా యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయంగా ఆయన ఖాళీగా ఉండటం కష్టమేనని చెబుతున్నారు. బీజేపీ వ్యూహాల్లో తెర వెనుక పాత్ర అయినా పోషిస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బీజేపీలో మోదీ, షాలు తప్ప మరొకరి వ్యూహాలు ఆలోచనలు అమలు చేసే పరిస్థితి లేదు. వారు చెప్పినట్లుగా చేయాల్సిందే. అదే సమయంలో వెంకయ్య సంప్రదాయ రాజకీయాలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి వాటికి మోదీ, షాలు వ్యతిరేకం. వారి రాజకీయాలు డైనమిక్‌గా ఉంటాయి.
వెంకయ్యనాయుడు ఇక పూర్తిగా రాజకీయాలకు దూరమైనట్లేనని బీజేపీ వర్గాలు కూడా ఓ అంచనాకు వస్తున్నాయి. ఆయనకు ఇక ఎలాంటి పదవి దక్కకపోవచ్చని అంటున్నారు. ఉపరాష్ట్రపతిగా చేసిన ఆయన మరో పదవి తీసుకోలేరు. ఆయన స్థాయికి తగ్గ పదవిని సృష్టించలేరు కూడా. అందుకే ఆయన రాజకీయ ప్రస్థానం ఇంతటితో ముగిసినట్లేనని అంచనా వేస్తున్నారు. అయితే వెంకయ్యనాయుడు మాత్రం ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. బహుశా తన పదవీ కాలం చివరి రోజున భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.