ధాన్యం విషయంలో తెలంగాణ సర్కార్ను కార్నర్ చేసేందుకు బీజేపీ మరోసారి రెడీ అయింది. ఉదయం తెలంగాణ సర్కార్ ధాన్యం విషయంలో ఎన్ని తప్పులు చేసిందో చెబుతూ ఓ పత్రం విడుదల చేశారు. సాయంత్రం పీయూష్ గోయల్ ప్రెస్ మీట్ మరింత వివరంగా వాటి గురించి చెబుతూ కేసీఆర్ చేసిన తప్పుల గురించి వివరించారు . అందులో ప్రధానమైనది… పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యం తెలంగాణ సర్కార్ పంపిణీ చేయకపోవడం.
గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద పేదలకు ఉచితంగా ఇచ్చేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించింది. ఉచితంగా ఇవ్వాల్సిన బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఏప్రిల్, మే రెండు నెలల కోటా లక్షా 90 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకుందని కానీ పేదలకు పంపిణీ చేయలేదని పీయూష్ గోయల్ ఆరోపించారు. పేదలకు మేలు చేయకుండా.. రాజకీయం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
అదే విధంగా అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలోనూ తెలంగాణ సర్కార్ విఫలమయిందని అందుకే సెంట్రల్ పూల్లోకి తెలంగాణ నుంచి బియ్యం సేకరణ నిలిపివేశామన్నారు. ఈ పరిస్థితికి తెలంగాణ ప్రభుత్వమే కారణం అని స్పష్టం చేసింది. కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల్లో ఎన్నో కీలక అంశాలు వెల్లడయ్యాయని కేంద్రం చెబుతోంది. న్యం విషయంలో తాము ఎప్పటికప్పుడు లోపాలు ఎత్తి చూపుతున్నా.. తనిఖీల తర్వాత సూచనలు చేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్రం తెలిపిది. లోపాలు సరిదిద్దుతామని హామీ ఇచ్చినా.. పట్టించుకోలేదని గుర్తు చేసింది.
మొత్తంగా పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా ధాన్యం అంశంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య వాదోపవాదాలు మాత్రం చోటు చేసుకుంటున్నాయి.