కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారో లేదో తెలియదు కానీ మూడేళ్ల నుంచి ఆయన ఇదిగో అదిగో అంటూనే ఉన్నారు. మరోసారి ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. ఈ సారి ఆయన రాజీనామా చేసి రమ్మని అమిత్ షా చెప్పినట్లుగా తెలుస్తోంది. అమిత్ షా చెప్పినట్లుగా రాజీనామా చేసి వెళ్లాలా లేదా అన్నదానిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఒక వేళ వెళ్తే ఉపఎన్నికలని ఫేస్ చేయాలి. అది ఆయన సమస్య. అయితే ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయన సోదరుడిపై పడటం ఖాయం.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పీసీసీ చీఫ్ పదవి కోసం చేయాల్సినదంతా చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో అసంతృప్తి కి గురయ్యారు. అయితే తన లాంటి నేచర్.. స్టేచర్ ఉన్న నేతలు ఇతర పార్టీల్లో ఇమడరని.. అక్కడ ఇప్పటికే పాతుకుపోయిన నేతలు ఎదగనివ్వరని భావించి కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. అసంతృప్తి స్వరాలు వినిపిస్తూ.. పని చేస్తున్నట్లుగా కనిపిస్తూ… వస్తున్నారు. ఆయన అసంతృప్తిని కాస్త తగ్గించడానికి కాంగ్రెస్ హైకమాండ్ స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చింది. అది కొత్త పదవే అయినా.. రాష్ట్రం మొత్తం తిరిగే చాన్స్ ఉందంటే రాష్ట్ర స్థాయి హోదా అని సర్దుకున్నారు.
కానీ ఇప్పుడు కీలకమైన పరిస్థితుల్లో ఆయన సోదరుడు పార్టీని డంప్ చేసి వెళ్లిపోతే.. హైకమాండ్ వద్ద కోమటిరెడ్డి పలుకుబడి పూర్తిగా సన్నబడటం ఖాయం. ఇప్పటికే రేవంత్ రెడ్డి పై హైకమాండ్ నమ్మకం చూపిస్తోంది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వెళ్లిపోతే.. తమ్ముడ్ని కూడా ఆపలేకపోయాడన్న వాదనే కాదు.. ఆయనే పంపించారని కూడా హైకమాండ్‌కు ఫిర్యాదులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎలాగైనా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌తో పాటు తన అన్న ను కూడా రిస్క్‌లో పెడుతున్నట్లుగానే ఉన్నారు.