మునుగోడులో ఉపఎన్నిక తీసుకు వచ్చి … గెలిచి బీజేపీకి తిరుగులేదని అనిపించుకోవాలనుకుంటున్నారని టీఆర్ఎస్కు గట్టి నమ్మకం ఏర్పడింది. ఎక్కడ ఉపఎన్నికలు వస్తే అక్కడ టీఆర్ఎస్ దూకుడుగా ప్రారంభించే కార్యక్రమాలను మునుగోడులో ప్రారంభించేశారు. గతంలో మునుగోడులో ఇచ్చిన కల్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వల్లనే బౌన్స్ అయ్యాయని చెప్పి ఇప్పుడు కొత్త చెక్కులను మంత్రి జగదీష్ రెడ్డి పంచడం ప్రారంభించారు.
చాలా కాలంగా ప్రజల డిమాండ్‌గా ఉన్న గట్టుప్పలను ప్రత్యేక మండల కేంద్రం చేయడాన్ని నెరవేర్చారు. రెండు రోజుల కిందటే ఉత్తర్వులు కూడా వచ్చేశాయి. ఇప్పుడు నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దృష్టి సారించారు. ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా భారీగా పనులు ప్రారభించడం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనవాయితీ. అందుకే తమకూ ఉపఎన్నిక వస్తే బాగుండని ప్రజలు అనుకుంటున్నారని గతంలో ప్రచారం జరిగింది. ఆ తరహాలోనే మునుగోడు ప్రజల్నీ టీఆర్ఎస్ సర్కార్ నిరాశ పరిచే పరిస్థితి లేదు.
అదే సమయంలో కాంగ్రెస్ నేతల్ని ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి అనుచరులకు టీఆర్ఎస్ కండువా కప్పేందుకు ప్లాన్లు వేసుకుంటున్నారు. ఆదివారమే చేరికలు ప్రారంభించారు. ఓ సర్పంచ్, ఎంపీటీసీలకు మంత్రి జగదీశ్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పారు. త్వరలో మరికొంత మంది కీలక నేతల్ని లాగాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో ముందు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. అయితే రాజీనామా చేస్తానని.. ఉపఎన్నిక వస్తుందని.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం క్లారిటీగా చెప్పలేకపోతున్నారు.