ప్రస్తుతం `రంగమార్తండ` సినిమాని పూర్తి చేసి, విడుదల చేసే పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు కృష్ణవంశీ. అయితే మరోవైపు తన డ్రీమ్ ప్రాజెక్ట్ `అన్నం` కథని కూడా తయారు చేసేస్తున్నాడు. ఫుడ్ మాఫియాపై కృష్ణవంశీ చేస్తున్న యుద్ధం `అన్నం`. ఈ కథ కోసం కృష్ణవంశీ బాగా రిసెర్చ్ చేశాడట. కచ్చితంగా.. తన కెరీర్లో `ఖడ్గం`, `రాఖీ`లాంటి మంచి సినిమా అవుతుందని బలంగా నమ్ముతున్నాడు. అయితే ఈ కథ చెప్పడానికి తనకో స్టార్ కావాలి. చిన్న హీరోలతో ఈ కథ చెబితే.. జనాలకు రిచ్ అవ్వదు. అందుకే స్టార్ల కోసం అన్వేషిస్తున్నాడు. `అన్నం` కథ… చిరు, బాలయ్యలో ఎవరికైనా బాగుంటుందని వంశీ భావిస్తున్నాడు. చిరంజీవితో కృష్ణవంశీకి సన్నిహిత సంబంధాలున్నాయి. `రంగమార్తండ`కి చిరు వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో `అన్నం` పాయింట్ ని కూడా వినిపించాడట కృష్ఱవంశీ. `కథ పూర్తిగా సిద్ధం చేయ్… అప్పుడు వింటా` అని చిరు మాటిచ్చాడట. బాలయ్యతో `రైతు` సినిమా చేద్దామనుకొన్నాడు కృష్ణవంశీ. కానీ అది కుదర్లేదు. అప్పటి నంచీ బాలయ్యతో కృష్ణవంశీ టచ్‌లోనే ఉన్నాడట. ఈసారి `అన్నం` కథని బాలయ్యకు వినిపించి ఓకే చేయించుకోవాలన్నది వంశీ ప్లాన్.
కృష్ణవంశీకి హిట్టు పడి చాలా కాలం అయ్యింది. `చందమామ` తరవాత మరో విజయాన్ని చూడలేకపోయాడు. తన ఆశలన్నీ ఇప్పుడు `రంగమార్తండ`పైనే. ఈ సినిమా హిట్టయితే.. మళ్లీ కృష్ణవంశీతో చేయడానికి పెద్ద హీరోలు ధైర్యం చేస్తారు. అందుకే తన మొదటి టార్గెట్ `రంగమార్తండ`ని హిట్ చేయడం. ఆ తరవాతే.. `అన్నం` హీరోని పట్టుకోవడం. కృష్ణవంశీ గనుక ఫామ్‌లోకి వస్తే – `అన్నం` ఓ పెద్ద హీరోతోనే సెట్స్‌పైకి వెళ్లడం ఖాయం.