పోస్టు చేయని ఉత్తరాలెన్నో. పోస్టు చేరినా చేరని ఉత్తరాలు ఇంకొన్ని. అలాంటి ఓ ఉత్తరం కథ – `సీతారామం`. యుద్ధంతో రాసిన ప్రేమకథ అని ఈ సినిమా గురించి ఒకే ఒక్క మాటలో చెప్పేస్తోంది చిత్రబృందం. అయితే ఈ ప్రేమకథ ఓ ఉత్తరం చుట్టూ తిరుగుతుంది. రామ్ రాసిన ఆ ఉత్తరం సీతకు చేరిందా, లేదా? అనేదే కథ. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు. అశ్వనీదత్ నిర్మించారు. ఆగస్టు 5న విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ బయటకు వదిలారు.
2 నిమిషాల 12 సెకన్ల ట్రైలర్ ఇది.
“ఇరవై ఏళ్ల క్రితం లెఫ్ట్‌నెంట్ రామ్ నాకొక బాధ్యత అప్పగించాడు
ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి..“ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. సో.. కథకు బీజం ఏమిటన్నది ముందు మాటలోనే చెప్పేశారన్నమాట. ఆ ఉత్తరం పట్టుకొని అఫ్రిన్ (రష్మిక) ఓ ప్రయాణం మొదలెడుతుంది. పది రోజుల్లో సీతని వెదకి పట్టుకొని ఆ ఉత్తరం ఇవ్వాలి. అదే తన టార్గెట్.
“సీతామహాలక్ష్మి అనే పేరుతో.. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎవ్వరూ లేరు….“ అంటూ… తన ప్రయాణానికి అందరూ అడ్డుకట్ట వేస్తుంటారు. అయినా సరే, సీత కోసం అన్వేషిస్తూనే ఉంటుంది.
సీత, రాముల ప్రేమకథని హను చాలా అందంగా, హృద్యంగా చూపించారు. 1965 నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ… ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా సాగింది. “నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే – కాశ్మీర్‌ని మంచుకొదిలేసి వస్తారా?“ అనే అందమైన మాటలు వినిపించాయి. సీత కోసం అన్వేషించే క్రమంలో రామ్ గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అవేంటన్నది కూడా ఆసక్తికరంగానే మలిచినట్టు అర్థం అవుతోంది. ప్రకాష్‌రాజ్, తరుణ్ భాస్కర్, సుమంత్, భూమిక ఇలా చాలా మంది పేరున్న నటీనటులు తెరపై కనిపిస్తున్నారు. మంచు కొండల నేపథ్యం, 1965 నాటి కాలం… వెరసి.. ఓ అందమైన దృశ్య రూపకంగా ఈ ప్రేమ కథ నిలవబోతోందనిపిస్తోంది. ఇప్పటికే పాటలకుమంచి స్పందన వచ్చింది. విశాల్ శేఖర్ నేపథ్య సంగీతం సైతం వినసొంపుగా సాగింది. తెలుగులో స్వచ్ఛమైన ప్రేమ కథ చూసి చాలాకాలమైంది. ఆ లోటు `సీతారామం` తీరుస్తుందేమో చూడాలి.