టీఆర్ఎస్కు దూరమై ఏ పార్టీ దరి చేసుకోక.. ఆరోగ్యం బాగోలేక ఇంటికే పరిమితమైన డీఎస్ ఇప్పుడు రాజకీయ అంచనాలు వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో షర్మిల సీఎం కావడం ఖాయమని ప్రకటించారు. ఇవాళ షర్మిల నిజామాబాద్‌లోని డీఎస్ ఇంటికి ప్రత్యేకంగా వెళ్లారు. కాసేపు చర్చించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. డిఎస్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. వైఎస్సార్ తో ఉన్న పాత అనుభవాలను గుర్తు చేసుకున్న డీఎస్.. తెలంగాణ ప్రజల్లో వైఎస్సార్ పై అభిమానం చెక్కు చెదర కుండా ఉందని షర్మిలకు భరోసా ఇచ్చారు.
సరైన టైం లో ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉండబోతుందని నా రాజకీయ అనుభవం తో చెప్తున్న.. షర్మిల ముఖ్యమంత్రి అవుతుందని డిఎస్ తేల్చేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని 2003 లోనే నేను చెప్పాననని అది నిజమయిందని…. భవిష్యత్ లో వైఎస్సార్ బిడ్డ ముఖ్యమంత్రి తప్పక అవుతుందని డీఎస్ స్పష్టం చేశారు. అయితే డీఎస్ ఏ రాష్ట్రం గురించి మాట్లాడారో క్లారిటీ లేదు. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలు 2023లోనే జరుగుతాయి. ఎవరైనా ఎన్నికల్లో గెలిస్తే 2023లోనే సీఎం అవుతారు.
ఏపీలో మాత్రం 2024లో ఎన్నికలు జరుగుతాయి. బహుశా.. డీఎస్ ఏపీని ఉద్దేశించి చెప్పి ఉంటారని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు. డీఎస్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరాలని ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఆయన ఆరోగ్యం కూడా సహకరించకపోతూండటంతో రాజకీయాలు చేయలేకపోతున్నారు. ఆయన కుమారుడు అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. బీజేపీ కీలక నేతల్లో ఒకరిగా ఎదిగారు.