వైసీపీ ఇప్పుడు సోషల్ మీడియా వారియర్స్ కోసం చూస్తోంది. నేరుగా ప్రకటనలు ఇస్తోంది. ఎంత చెల్లిస్తారో.. చెల్లిస్తారో లేదో తెలియదు కానీ… ప్రభుత్వం కోసం ప్రచారం చేసేలా.. ఇతర పార్టీల మీద విరుచుకుపడేలా సోషల్ మీడియా వారియర్స్ కావాలని ప్రకటనలు ఇస్తోంది. నిజానికి ఇలాంటి వారియర్స్ కొరత వైసీపీకి రావడమే విచిత్రం. ఎందుకంటే సోషల్ మీడియాను అత్యంత దారుణంగా వాడుకున్న రికార్డు వైసీపీకి ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు .. అధికార పక్షం టీడీపీ తట్టుకోలేకపోయింది. ఆ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఎక్కువగా ఉందంటే వాళ్లు చెప్పినదంతా మెజార్టీ జనం నమ్మేశారు.
కానీ అధికారంలోకి వచ్చాక వారంతా ఏమయ్యారో వైసీపీ పెద్దలకే తెలియాలి. ఎంత మందిని డబ్బులిచ్చి పెట్టుకున్నా.. పార్టీ కార్యకర్తలు స్వచ్చందంగా పని చేయకపోతే ఆ ఎఫెక్ట్ రాదు . అధికారంలోకి వచ్చాక వారంతా దూరమైనట్లుగా కనిపిస్తోంది. నిజానికి రెండేళ్ల కిందటి వరకూ వైసీపీకి పెద్ద సైన్యమే ఉండేది. ఆ సైన్యాన్ని వాడుకుని న్యాయవ్యవస్థపై కూడాదాడికి దిగడంతో చాలా మంది కేసుల్లో ఇరుక్కున్నారు. కనీసం బెయిలిప్పించడానికి కూడా వైసీపీ నేతలు ముందుకు రాలేదు. ఆ తర్వాత కొంతమంది సిన్సియర్‌గా పార్టీ కోసం పని చేసిన వారు చనిపోయిన పట్టించుకోలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో దాదాపుగా సోషల్ మీడియా వారియర్స్ నిస్తేజమైపోయారు. పేటీఎం ఖాతాలు మాత్రం మిగిలాయని.. వారు మాత్రమే దుర్భాషలు ఆడుతున్నారన్న ప్రచారం ఉంది. అందుకే ఈ కొరత అధిగమించడానికి సోషల్ మీడియావారియర్స్ కావాలంటే హడావుడి చేస్తున్నారు. గతంలో అవార్డులు.. అలాగే ఐడీకార్డులు కూడా ఇచ్చారు. ఏవీ వర్కవుట్ కావడం లేదు. కనీసం ఈ వారియర్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయినా సక్సెస్ అవుతుందేమో చూడాలి.