హోదా కోసం నిరంతర ప్రయత్నం అడుగుతూనే ఉంటాం అని చెబుతూ వస్తున్న ఏపీ ప్రభుత్వానికి జీవీఎల్ నరసింహారావు షాకిచ్చారు. రాజ్యసభలో ఓ ప్రశ్న అడిగి మరీ ఏపీ ప్రభుత్వం ప్యాకేజీ తీసుకుంటోందని సమాధానం ఇప్పించారు. అందుకే ఇక ప్రత్యేకహోదా ప్రశ్నే రాదని జీవీఎల్ చెబుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హోదాకు బదులు ప్యాకేజీ ప్రకటించారు. హోదా పేరు లేకుండా ఆ ప్రయోజనాలన్నీ కల్పిస్తామన్నారు. దానికి చంద్రబాబు అంగీకరించారు.
అయితే తర్వాత ఎక్కడా ఆ ప్రయోజనాలు ఇవ్వకపోతూండే సరికి హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి…ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారు. ప్యాకేజీ నిధులు తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆ ప్యాకేజీ కింద కేంద్రం ఇచ్చే నిధులను తీసుకుంటోంది. ప్యాకేజీలో భాగంగా ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్‌ల కోసం ఏపీ తీసుకునే నిధులు కేంద్రం చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి నిధులు ఏపీకి రూ.7798 కోట్లను కేంద్రం ఇచ్చిందని జీవీఎల్ చెబుతున్నారు. మొత్తం 17 ఈఏపీ ప్రాజెక్టులకు ప్యాకేజీలో భాగంగా కేంద్రం నిధులు ఇస్తోందని వాటిని ఏపీ ప్రభుత్వం తీసుకుంటోందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎపీకి ప్యాకేజిని అమలు చేస్తుందని చెప్పటం ద్వార హోదా అనే విషయం అసలు చర్చల్లో కానీ ఆలోచనల్లో కానీ లేదని మరోసారి స్పష్టమయింది. ఇటీవల ఎపీలో ప్రదాని మోడీ పర్యటన సందర్బంగా సీఎం జగన్ హోదా పై లిఖిత పూర్వకంగా విజ్ఞాపనను కూడా స్వయంగా అందించారు. తాజాగా పార్లమెంట్ సాక్షిగా ప్యాకేజీ అమల్లో ఉందని చెప్పడం ద్వారా హోదా ఇక ఇచ్చేది లేదని చెప్పినట్లయింది. అయితే హోదా కావాల్సిందే అంటున్న ఏపీ ప్రభుత్వం ప్యాకేజీ నిధులు ఎందుకు తీసుకుంటుందో అన్నది కీలకంగా మారింది. నిధులు తీసుకుంటే హోదా వద్దని ప్యాకేజీ కి ఓకే అని అంగీకరించినట్లే కదా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. మరి ఏపీ సర్కార్ జీవీఎల్‌కు కౌంటర్ ఇస్తుందో లేదో మరి !