తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. నిజంగా ఉంటాయో లేదో కానీ బీజేపీ నేతలు మాత్రం 27వ తేదీ నుంచి మాత్రం అందరూ పోలోమని తమ పార్టీకి వస్తారని కండువాలు కప్పేస్తామని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ చేరిక కమిటీ చైర్మన్ ఈటల కూడా అదే చెబుతున్నారు. అయితే వారి ప్రచారమే కానీ.. టీఆర్ఎస్‌లో అంత వలసల వాతావరణం బహిరంగంగా కనిపించడం లేదు. పార్టీలో ప్రాధాన్యం దక్కని వారు.. పార్టీ కార్యకలాపాల్లో లేని కొంత మంది వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ పదవుల్లో ఉన్న వారు కానీ.. కీలకమైన నేతలు కానీ పక్క చూపులు చూస్తున్నట్లుగా ఎక్కడా సమాచారం బయటకు రావడం లేదు.
ప్రశాంత్ కిషోర్ సర్వేలో చాలా మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రిపోర్టులొస్తాయని.. వారందిరికి టిక్కెట్లు ఉండవని.. ఇలాంటి వారినందర్నీ తమ పార్టీలోకి చేర్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే ఆ ఎమ్మెల్యేలందరికీ కేసీఆర్‌తో.. కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎలాగైనా తాము పార్టీలో ప్రాధాన్యం దక్కించుకుంటామన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ బీజేపీ నమ్మి ఆ పార్టీలోకి వెళ్లే దైర్యం చేయలేరంటున్నారు. కేసీఆర్, కేటీఆర్ అభిమానాన్ని పోగొట్టుకున్న వారు మాత్రం పార్టీని వీడే అవకాశం ఉంది. అయితే అది కూడా ఇప్పుడే కాదని.. ఎన్నికలకు ముందేనని అంచనా వేస్తున్నారు.
ఇటీవల ప్రధాని పర్యటనకు ముందు కొంత మంది బీజేపీ కార్పొరేటర్లను టీఆర్ఎస్‌లో చేర్పించుకున్నారు. దీనికి ప్రతిగా దెబ్బకు దెబ్బతీయాలని బీజేపీ నేతలు పట్టుదలతో ఉన్నారు. కానీ అదంత తేలికగా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గత రెండు, మూడేళ్లుగా బీజేపీ నేతలు వలసల గురించి ప్రచారం చేస్తూనే ఉన్నారు . ఇతర రాష్ట్రాల్లో ఆపరేషన్లను పూర్తి చేస్తున్నారు కానీ తెలంగాణలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. టీఆర్ఎస్‌పై బీజేపీ మైండ్ గేమే ఆడుతోందని.. కానీ అది వర్కవుట్ కావడం లేదనేది ఎక్కువ మంది అభిప్రాయంగా మారింది.