చంద్రబాబు ఇంటికెళ్లి రెండు గంటల పాటు మోహన్ బాబు మంతనాలు జరిపారని ప్రో వైసీపీ మీడియా ఉదరగొట్టేసింది. చంద్రబాబు సీఎంగా ఉననప్పుడు మంచు లక్ష్మితో కలిసి వెళ్లి కలిసినప్పటి ఫోటోను ఎడిట్ చేసి.. చంద్రబాబు, మోహన్ బాబు కలిసిఉన్నట్లుగా చూపిస్తూ… రెండు చానల్స్ బ్రేకింగ్ స్టోరీని రన్ చేశాయి. అయితే అదే సమయంలో ప్రో టీడీపీ మీడియా పట్టించుకోలేదు. ముఖ్యంగా ఏబీఎన్‌లో కనీసం స్క్రోలింగ్ కూడా రాలేదు. ఈ రాజకీయం ఎంటో తేలాల్సిఉంది.
గత ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదని రోడ్ ఎక్కారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత వీరు ఎక్కడా కలుసుకోలేదు. వైఎస్ఆర్సీపీలో చేరినప్పటికీ మోహన్ బాబు తర్వాత ఆ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా ఎక్కడా కనిపించలేదు. పైగా ఆయనకు ఎలాంటి పదవులు కూడా ఇవ్వలేదు. కొన్నాళ్ల క్రితం తన కుటుంబంతో సహా వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. ఆ సమయంలో బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమని.. ఒక వేళ రాజకీయం అంటూ చేస్తే బీజేపీతోనేనన్నట్లుగా చెప్పుకొచ్చారు.
ఇటీవల మోహన్ బాబు కుటుంబానికి చెందిన విద్యానికేతన్‌ను … మోహన్ బాబు యూనివర్శిటీగా మార్చారు. ఒక వేళ ఏపీలో ప్రభుత్వం మారితే ఆ యూనివర్శిటీకి ఇబ్బందులు తప్పవు. తమను టార్గెట్ చేసిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టబోమని టీడీపీ నేతలు ఇప్పటికే ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో గాలి మారుతోందని గమనించి ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో చంద్రబాబుతో పరిచయాలు పెంచుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. కారణం ఏదైనా ప్రో వైసీపీ మీడిాయనే ఎందుకు హడావుడి చేస్తోందనేది తెలియాల్సి ఉంది.