ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి పెద్ద చిక్కు వచ్చి పడింది. ఆ చిక్కు చెత్త పన్ను. గడప గడపకూ వెళ్తూంటే ప్రజలు చెత్త పన్ను గురించి అడుగుతున్నారు. దీంతో ఆయన తన నియోజకవర్గం అధికారులకు చెత్తపన్ను వసూలు చేయవద్దని ఆదేశించారు.కానీ ఎవరూ పట్టించుకోలేదు. అంతే కాదు గుడివాడ ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. నెలకు పదహారు లక్షల టార్గెట్ పెట్టుకుంటే రూ. 14 లక్షలు వసూలు చేస్తున్నారు. తాను వసూలు చేయవద్దని చెప్పినా చేస్తున్నారని ఫీలయిన కొడాలి నాని.. నేరుగా సీఎంను కలిసి చెత్తపన్నును నిలిపివేయాలని కోరాలని నిర్ణయించుకున్నారు.
ఈ నిర్ణయం కూడా డ్రమెటిక్‌గా తీసుకున్నారు కొడాలి నాని. గుడివాడలో పర్యటిస్తున్న సమయంలో ప్రజలు చెత్తపన్ను గురించి ప్రస్తావించడంతో … అక్కడే ఉన్న అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చెప్పారని పన్ను వసూలు చేయడం ఆగదని తేల్చేయడంతో సీఎం దగ్గరే తేల్చుకుంటానన్నారు. అయితే తన ఒక్కడి వల్లే సాధ్యం కాదనుకున్నారేమో కానీ.. ఆయన వెంటనే మరో మాజీ మంత్రి పేర్ని నానికి ఫోన్ చేశారు. అన్నా .. చెత్త పన్ను రద్దు గురించి ముఖ్యమంత్రిని కలుద్దాం అని అడిగారు. దానికి ఆయనేమన్నారో స్పష్టత లేదు. కానీ చెత్తపన్నుపై మాత్రం నానీల ఉద్యమం ప్రారభమయిందంటున్నారు.
చెత్తపన్ను విషయంలో ప్రభుత్వానికి ఎంత బ్యాడ్ నేమ్ వచ్చిందో వైసీపీ ప్రజాప్రతినిధులకు బాగా తెలుసు. మామూలుగా అయితే ఇలాంటి పన్నులు చెల్లించిన వారి దగ్గరే తీసుకుంటారు. కానీ ఇప్పుడు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పన్ను కట్టకపోతే ఇంటి ముందు చెత్త వేయండన్న హెచ్చరికలు కూడా ధర్మాన వంటి మంత్రులు చేశారు. ఇవన్నీ సీఎంకు తెలియక కాదు. మరి ఇప్పుడు నానీలు చెప్పినంత మాత్రాన సీఎం జగన్ చెత్తపన్ను రద్దు చేస్తారా అన్నది వైసీపీలో హాట్ టాపిక్ !