కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక అసలు అజెండా వేరే ఉందని ఆయన తొలి రోజు సమావేశాలను బట్టి క్లారిటీ వచ్చేసింది. ఆ అజెండా అప్పులు. ఇప్పటికే ఇస్తామన్న అప్పులు రాకపోవడంతో వాటిపై చర్చించేందుకు వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వ సంస్థలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో పాటు మరో సంస్థ భారీగా రుణాలిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఎనభై శాతం రుణాలిచ్చాయి. మరో ఇరవై శాతం రావాల్సి ఉంది. ప్రాజెక్ట్ పురోగతిని బట్టి ఇవ్వాల్సి ఉది. ఇప్పుడు ప్రాజెక్ట్ పూర్తవుతున్నా ఆ రుణాలు అందడం లేదు. దీనికి కారణం ఆ సంస్థలు కొత్త రూల్స్ పెట్టడమే.
తాము ఇచ్చిన రుణానికి కేంద్రం గ్యారంటీ ఇప్పించారని రుణాలిచ్చిన సంస్థలు పట్టుబడుతున్నాయి. అందుకే మిగిలిన రుణం వాయిదా వేశారు. దీనిపై కేసీఆర్ మంగళవారం రోజంతా ఢిల్లీలో చర్చలు జరిపారు. ఆయా సంస్థల అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పులు ఇచ్చేందుకు… తీసుకునేందుకు జరిగిన ఒప్పందంలో ఎక్కడా కేంద్రం గ్యారంటీ అనే క్లాజే లేదని.. ఇప్పుడు కొత్తగా ఎందుకు పెడుతున్నారని ఆయన మండిపడినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంలో ఎన్ని చర్చలు జరిగినా..ఆయా ఫైనాన్స్ కార్పొరేషన్లు కాళేశ్వరానికి మిగతా అప్పు మంజూరు చేయాలంటే కేంద్రం గ్యారంటీ తప్పని సరి అని చెప్పి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే కేంద్రం .. తెలంగాణకు ఇవ్వాల్సిన అప్పులపై పరిమితి విధించింది. ఇప్పుడు ఫైనాన్స్ కార్పొరేషన్ల రుణాలపైనా ఆంక్షలు విధించడంతో కేసీఆర్‌కు టెన్షన్ ప్రారంభమయింది. కేంద్రం వద్దకు ఈ పంచాయతీ తీసుకెళ్లలేని విధంగా రాజకీయ వైరం ఉంది. మరో వైపు అప్పులు రాకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఢిల్లీలో కేసీఆర్ ఈ అంశాలపై మంతనాలు జరుపుతున్నారని అంటున్నారు. అంతకు మించి రాజకీయం ఏమీ లేదని భావిస్తున్నారు.