ప్రత్యేకహోదా వస్తే ఐటీ కట్టాల్సిన పని ఉండదని నాడు పదే పదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ ఆయనపై ఈ అంశంలో ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఆయన పోలవరం నిర్వాసితులకు సుద్దులు చెబుతూ కేంద్రమే ఇవ్వడం లేదని.. కేంద్రం ఇస్తే ఇలా మీట నొక్కేస్తానని చెప్పుకొచ్చారు. అసలు కేంద్రమే డబ్బులు ప్రింట్ చేస్తుందని కేంద్రం దగ్గర డబ్బులు లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోయారు. ప్రజల్నీ ఆశ్చర్యపరిచారు. ఈ మాత్రం తెలియకుండా జగన్ ముఖ్యమంత్రి అయ్యారా అని చాలా మంది నివ్వెరపోతున్నారు. అంతే కాదు డబ్బులు ప్రింట్ చేసుకునే హక్కు రాష్ట్రానికి ఇవ్వాలా అని సెటైర్లు వేస్తున్నారు.
జగన్‌కు ఆలోచనా స్థాయి అంతేనా ?
జగన్ అవగాహన స్థాయి అంతే ఉందని కొంత మంది విశ్లేషిస్తున్నారు. డబ్బులంటే ప్రింట్ చేసుకుంటే వస్తాయని పదో తరగతి ఫెయిలైన విద్యార్థులు అనుకుంటూ ఉంటారు. అలా ఇష్టం వచ్చినట్లుగా ప్రింట్ చేసుకునే శ్రీలంక దగ్గర్నుంచి సోమాలియా వరకూ అనేక దేశాలు కుప్పకూలిపోయాయని కాస్త అవగాహన ఉన్న వారికి అర్థమవుతుంది. ఎన్ని లక్షల కోట్ల ప్రింట్ చేసిన వాటిని తినలేరనే విషయాన్ని ముఖ్యమంత్రి ఎందుకు గుర్తించలేదని కొంత మంది ప్రశ్నిస్తున్నారు.
మోదీపై నెపం నెట్టేందుకు ఈ ప్లాన్ వాడుకున్నారా ?
అయితే ఈ మాత్రం కూడా ముఖ్యమంత్రికి తెలియకుండా ఉండదని.. ఆయన రాజకీయం కోసం అలా మాట్లాడారని కొంత మంది వైసీపీ సపోర్టర్లు అంటున్నారు. గోదావరి నిర్వాసిత ప్రజలకు ఎక్కువ మందికి అవగాహన ఉండదని… వారితో అలాగే మాట్లాడాలని.. అంటున్నారు. అంటే నెపం మొత్తం కేంద్రం మీద.. ప్రధాని మోదీ మీద తోసేయడానికి ఆయన వ్యూహాత్మకంగా ఆ మాటలన్నారని అంటున్నారు. అదే సమయంలో ప్రజలు మిమ్మల్ని తిట్టుకుంటున్నారని మోదీకి చెబుతానంటూ వారితో వ్యాఖ్యానించి.. తన వైపు ఏమీ లేదని ఆయన చెప్పుకున్నారని గుర్తు చేస్తున్నారు.
ఎన్నో సార్లు బయటపడిన జగన్ అవగాహనా లోపం !
అవగాహన లేకపోవడమో… లేకపోతే రాజకీయమో కానీ జగన్మోహన్ రెడ్డి అజ్ఞాన స్థాయి ఎవరూ ఊహించని విధంగా బయటపడింది. గతంలోనూ బయటపడింది. రాసిచ్చిన స్పీచ్‌లు లేకపోతే ఆయన మాట్లాడే మాటలు ట్రోలింగ్ సరుకులా… అజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనంలా మారుతున్నాయి. దాన్ని రాజకీయం అని సమర్థించుకునేవారూ ఉండటం ఆయన అదృష్టం అనుకోవచ్చు.