Vikrant Rona movie review
రేటింగ్: 2.5/5
కన్నడ సినిమా ఎదిగింది. ఇది వరకు శాండిల్‌వుడ్ పేరు చెబితే…. లో బడ్జెట్ సినిమాలే గుర్తొచ్చేవి. అయితే కేజీఎఫ్ లాంటి సినిమాలు శాండిల్ వుడ్ జాతకాన్ని మార్చేశాయి. కథలో విషయం ఉండేలే గానీ, ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చన్న ధీమా కలిగించాయి. ఆ స్ఫూర్తితో అక్కడ వైవిధ్యభరితమైన చిత్రాలు రూపొందుతున్నాయి. తెలుగులో విలన్ ఇమేజ్ తెచ్చుకొన్న కిచ్చా సుదీప్ కన్నడలో స్టార్ హీరో. అడపా దడపా హిట్లు కొట్టి, తనకంటూ ఓ మైలేజీ సంపాదించుకొన్నాడు. ఇప్పుడు కిచ్చా సుదీప్ తన కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా ఒకటి చేశాడు. అదే… `విక్రాంత్ రోణ` వీ.ఆర్ పేరుతో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ వీ.ఆర్ ఎలా ఉంది? కన్నడ సినిమా స్థాయిని నిలబెట్టిందా, లేదంటే కేజీఎఫ్‌ని చూసి, వాతలు పెట్టుకొందా?
అదో అటవీ ప్రాంతం. అక్కడ కొమరొట్టు అనే ఇంట్లో ఓ భయంకరమైన రాక్షసుడు ఉన్నాడని, ఆ ఇంట్లో ఎవరైనా అడుగుపెడితే.. వాళ్లని సంహరిస్తుంటాడని ఓ నమ్మకం బలంగా నాటుకుపోయింది. దానికి తగ్గట్టే.. ఆ ఇంటి పరిసరాల్లో హత్యలు జరుగుతుంటాయి. చిన్న పిలలు మాయమైపోయి… ఆ అడవిలో చెట్లకు శవాలుగా వేలాడుతుంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ అధికారి కూడా శవంలా మారి, కొమరట్టు బావిలో మొండెం లేకుండా వేలాడుతుంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ స్థానంలోకి విక్రాంత్ రోణ (సుదీప్) వస్తాడు. ఈ కేసుని తనదైన స్టైల్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. మరి ఆ విచారణలో తెలుసుకొన్న నిజాలేంటి? చనిపోతున్న పిల్లలకూ, కొమరట్టు ఇంటికీ, ఆ రాక్షసుడికీ ఏమైనా లింకు ఉందా? ఇదంతా మిగిలిన కథ.
ఇదో యాక్షన్ థ్రిల్లర్. ఈ జోనర్లో కథలు చాలా వచ్చాయి. కాకపోతే… `విక్రాంత్ రోణ` కోసం ఓ దట్టమైన అటవీ ప్రాంతం సృష్టించారు. కథని కూడా పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లారు. దాంతో ఈ కథకు కొత్త లుక్ వస్తుంది. కొమరొట్టు ఇంటి వాతావరణం, అక్కడ జరుగుతున్న హత్యలు కథ ప్రారంభంలో చూపించి ఆసక్తి కలిగించారు. సినిమా మొదలైన 20 నిమిషాలకు సుదీప్ ఓ స్టైలీష్ ఫైట్‌తో.. ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి కథంతా విక్రాంత్ రోణ చుట్టూనే తిరుగుతుంది. సాధారణంగా ఇలాంటి ఇన్వెస్టిగేషన్ కథల్లో.. ముందు చాలా పాత్రలపై అనుమానాల్ని కలిగించేలా సీన్లు అల్లుతారు. కొంతమంది అమాయక చక్రవర్తుల్ని కూడా చూపిస్తారు. ఆ తరవాతే… అమాయక చక్రవర్తులే అసలైన విలన్లుగా నిరూపిస్తారు. సేమ్ టూ సేమ్… ఈ కథలోనూ అదే జరిగింది. తెరపై కనిపిస్తున్న చాలామందిపై అనుమానాలు కలిగించి.. చివరికి కొత్త నేరస్థుడ్ని తీసుకొచ్చి.. కళ్ల ముందు నిలుపుతారు. పాత సినిమాల స్క్రీన్ ప్లేనే విక్రాంత్ రోణ ఫాలో అయిపోయాడు.
ఈ కథలో కొన్ని సైడ్ ట్రాకులు కూడా కనిపిస్తుంటాయి. ఉదాహరణకు… సంజు కథ. ఇరవై ఏళ్ల క్రితం ఇంటి నుంచి తప్పిపోయిన కొడుకు మళ్లీ తిరిగి రావడం ఈ ట్రాక్. ఓ వైపు.. జనార్థన్ గంభీర్ (మధుసూధన్ రావు) ట్రాక్. మరోవైపు.. స్మగ్లింగ్. ఇవన్నీ చూస్తుంటే అసలు ట్రాకేమిటో.. అన్న కన్ఫ్యూజ్ వస్తుంది. ఇంట్రవెల్ తరవాత కూడా అసలు ఈ ఇన్వెస్టిగేషన్ ధ్యేయం ఏమిటో అర్థం కాదు. ఈ సినిమాకి హారర్ లుక్ ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నిస్తాడు. అసలు అలాంటి బిల్డప్పుల వల్లే… సినిమాలో ఎమోషన్ మిస్సవుతుంటుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ నిజంగా థ్రిల్లింగ్‌గా ఉంది. కానీ దాన్ని ప్రోపర్ గా డిజైన్ చేయలేదు. చేసుంటే.. ఓ హై తో ఇంట్రవెల్ కార్డు పడేది. దాన్ని మిస్ చేసుకొన్నారు. ద్వితీయార్థంలో కీలకమైన ఇన్వెస్టిగేషన్ చాలా చప్పగా సాగుతుంది. పాత సినిమాల ఛాయలు కొన్ని గుర్తొస్తాయి. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్టు వచ్చినా – అప్పటికే… జనాలకు నీరసం వచ్చేస్తుంది. ఈ ట్విస్టు కోసం ఇంత కథ రాసుకొన్నాడా? అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఇదో రివైంజ్ డ్రామా అని తేల్చేశారు. అయితే ఆ రివైంజ్ లో న్యాయం లేదు. కర్కసత్వం తప్ప. అదేమిటన్నది సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది.
సుదీప్ స్టైలీష్‌గా కనిపించాడు. తన ఫ్యాన్స్‌కి (కన్నడలో ఉన్నారు లెండి) ఏం కావాలో అది ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ప్రతీసారీ బేస్ వాయిస్ తో డబ్బింగ్ చెప్పడం వల్ల కొన్ని డైలాగులు అర్థం కాలేదు. సంజుగా కనిపించిన నిరూప్ బండారి… ఓరకంగా సెకండ్ హీరో అనుకోవాలి. తన లవ్ ట్రాక్ కథని తప్పు దోవ పట్టిస్తుందనిపిస్తుంది. కానీ…. అది దర్శకుడి స్క్రీన్ ప్లే లాజిక్కు అని ఆ తరవాత అర్థమవుతుంది. చాలా ఎక్కువ క్యారెక్టర్లే ఉన్నా.. ఎవరివీ అంతగా ప్రాధాన్యం లేని పాత్రలే. హీరోయిన్లతో సహా. జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓ పాటలో మెరిసింది. ఆ ఐటెమ్ పాటే.. ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో… ఊపు తెచ్చే సందర్భం.. ఆ పాటే.
సౌండ్ డిజైనింగ్ చాలా బాగుంది. విజువల్స్ మనల్ని ఓ కొత్త ప్రపంచానికి తీసుకెళ్లాయి. అదంతా సెట్లో జరిగిందంటే నమ్మలేం. ప్రొడక్షన్ డిజైనింగ్ అత్యున్నత స్థాయిలో ఉంది. ఈ సినిమాని త్రీడీ ఎఫెక్ట్ లో తీశారు. కొన్ని షాట్ల కోసం త్రీడీలో సినిమా తీయడం సాహసమే. ఈ కథని 80ల్లోనో, 90ల్లోనో జరుగుతున్నట్టుగా చూపించారు. కానీ.. అందరూ మెడ్రన్ డ్రస్సులే వేసుకొంటారు. కాస్ట్యూమ్స్‌లో శ్రద్ధ తీసుకోవాల్సింది. యాక్షన్ సీన్లు ఎక్కువే ఉన్నా – ఎందుకో అనుకొన్నంత థ్రిల్ రాలేదు. కాకపోతే.. ప్రతీ ఫ్రేమ్ ని రిచ్‌గా చూపించాలని బాగా కష్టపడ్డారు.
మామూలు రివైంజ్ డ్రామాని యాక్షన్ అడ్వెంచరెస్‌గా మలిచే ప్రయత్నంలో కొంత హారర్ ఎలిమెంట్స్‌ని, కొన్ని ట్విస్టుల్నీ జోడించి కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. తెరపై ఖర్చు కనిపించింది తప్ప, చిత్రబృందం చేసిన ప్రయత్నానికి తగిన ప్రతిఫలం మాత్రం దక్కలేదు.
రేటింగ్: 2.5/5