కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరికపై ఖచ్చితంగా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆయన ఇవాళ బీజేపీ రాష్ట్ర నేతల్ని కలిసి పార్టీలోకి వచ్చేందుకు సంసిద్ధత తెలుపాల్సి ఉంది. కానీ ఆయన హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు. తనను సంప్రదించిన బీజేపీ నేతలకు మరో వారం రోజుల సమయం అడిగారు. దీంతో బీజేపీ నేతలు ఉసూరుమన్నారు. బీజేపీలో చేరడం.. ఆయన రాజీనామా చేయడం.. ఆ తర్వాత ఉపఎన్నిక రావడం ఖాయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి ఏ అయోమయంలో ఉన్నారో ఇప్పుడూ అంతే ఉన్నారు.
ఆయన బీజేపీలో ఖచ్చితంగా చేరుతానని ఇప్పటి వరకూ ప్రకటించలేదు. మరో వైపు మునుగోడులో ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డినే నిలబెడుతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీకి ఉపయోగపడే రాజకీయం కోసం కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టడం.. అలాగే సొంత ఇంట్లో కుంపటి పెట్టుకోవడం ఎందుకన్న ఆలోచనలో కోమటిరెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఆయన ఎన్నికల ఖర్చు గురించి కూడా ఆలోచిస్తున్నారు.
ఉపఎన్నిక వస్తే.. ఎంత ఖర్చు పెట్టుకోవాలో ఊహించడం ఆయనకు కష్టమేం కాదు., అలా భారీగాఖర్చు పెట్టుకుని గెలిస్తే పదవి ఉండేది మరో ఎడెనిమిది నెలలు మాత్రమే. ఆ తర్వాత మళ్లీ ఖర్చు పెట్టుకోవాలి. బీజేపీ హైకమాండ్ పైసా ఇస్తుందన్న నమ్మకం రాజగోపాల్ రెడ్డికి లేదు. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వరుసగా చందాలు వసూలు చేస్తోంది. అందుకే రాజగోపాల్ రెడ్డి డైలమాలో ఉన్నారంటున్నారు.