తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న కేసినో కింగ్స్ చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిలపై ఈడీ దాడుల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది. కేసినో నిర్వహణ అనేది సెకండరీ పాయింట్. అసలు ఈడీకి ఈ అంశంతో సంబంధం లేదు. ఈడీ అసలు దృష్టి పెట్టింది.. హవాలా లావాదేవీలపైనే. రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చీకోటి ప్రవీణ్ చాలా సన్నిహితుడు. కనీసం పదహారు మంది ఎమ్మెల్యేలు.. వారిలో కొంత మంది మాజీ మంత్రులకు ఆయన సన్నిహితుడని తేలింది.
కేసినోలు విదేశాల్లో నిర్వహించినప్పుడు.. ఇక్కడ కోట్లకు కోట్లు వారి వద్ద నుంచి తీసుకుని అక్కడ వారికి డాలర్ల రూపంలో కేసినోలు ఆడుకోవడానికి సమకూర్చేవాడని చెబుతున్నారు. ఈ లెక్కలు ఈడికి తెలియడంతోనే దాడులు జరిగాయంటున్నారు. ఇది చిన్న కేసు కాదని.. ముందు ముందు చాలా వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. హవాలా విషయంలో ఈడీ సీరియస్‌గా ఉంటుందని… సోమవారం .. చీకోటి ప్రవీణ్‌ను ప్రశ్నించిన తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.
వందల కోట్ల దందా వెనుక అధికార పార్టీ నేతలు ఉండటం ఖాయంగా కనిపిస్తూండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం నమోదయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ కేసు డెలవప్మెంట్స్పై రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి ప్రారంభమైంది. గుడివాడలోనూ ప్రవీణ్ కేసినో నిర్వహించడం.. కొడాలి నాని, వంశీ ఇద్దరూ తన ఫ్రెండ్స్ అని ప్రవీణ్ చెప్పుకుంటున్న వీడియోలు వైరల్ కావడంతో వారిపైనా అందరి దృష్టి పడింది.