టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అతి విధేయుల సమస్య ఎక్కువైంది. ఆయనను కాకా పట్టడానికో.. ఆయన దృష్టిలో పడటానికో అటు పార్టీ నేతలు.. ఇటు అధికారులు కూడా హడావుడి చేస్తూండటతో ఆయన ప్రేమేయం లేకుండానే ఆయన వివాదాల్లోకి వెళ్లిపోతున్నారు. దానికి తాజా ఉదాహరణ పుట్టినరోజు వేడుకలు. మంచిర్యాల జిల్లాలో కేటీఆర్ పుట్టిన రోజు వేడుకల్ని స్కూళ్లలో నిర్వహించారు. అలా వేడుకలకు రాని వారిని సస్పెండ్ చేశారు. ఇదేదో నోటిమాటగా జరిగింది కాదు. నేరుగా ఉత్తర్వులిచ్చేశారు. ఇది జాతీయంగా చర్చనీయాంశమయింది.
నిజానికి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోలేదు. వద్దని చెప్పారు. పైగా ఆయన కాలికి గాయం అయింది. వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అయినా సరే కొంత మంది అత్యుత్సాహానికి వెళ్లారు. ఇప్పుడు కేటీఆర్ కు ఇబ్బందులు తెచ్చి పెట్టారు. సస్పెండ్ కు గురైన ఉద్యోగుల్ని కాదని.. ముందు సస్పెండ్ చేసిన అధికారిని తొలగించాలని కేటీఆర్ ఆదేశించారు. అధికారులు అలా చేస్తారు.. మరో వారంలో పోస్టింగ్ ఇస్తారు అది వేరే విషయం. కానీ ఇక్కడ కేటీఆర్ ఇమేజే డ్యామేజ్ అవుతుందనే విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
అధికారుల తీరే ఇలా ఉంటే ఇక టీఆర్ఎస్ నేతలు మాత్రం ఊరుకుంటారా…. అంత కంటే తామే ఎక్కువ అన్నట్లుగా చెలరేగిపోరా ? అదే జరుగుతోంది. కేసీఆర్ ను కూడా పట్టించుకోకుండా కేటీఆర్ భజనలో రాటుదేలిపోతున్నారు. అయితే అది వారి పార్టీ వ్యవహారం కాబట్టి … తప్పని ఎవరూ చెప్పడం లేదు.. కానీ ఈ వ్యక్తి పూజేమిటని సామాన్యులు అనుకునే పరిస్థితి.