వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఏం చేస్తున్నారు ? తాము కేంద్రంపై యుద్ధం చేస్తున్నామని జగన్ ఇక్కడ జనంలోకి వెళ్లినప్పుడు చెబుతున్నారు. కానీ అక్కడ పార్లమెంట్ సమావేశాలకు వెళ్లిన ఎంపీలు ఏం చేస్తున్నారో చూస్తే జనం కూడా అవాక్కవుతారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిందే లేదు. సమావేశాలకు వెళ్తున్నారు .. .వస్తున్నారు. ఇతర పక్షాలు వివిధ అంశాలపై పార్లమెంట్లో పోరాటం చేస్తున్నాయి. సభను స్తంభింప చేస్తున్నాయి. చివరికి పొరుగు రాష్ట్రం తెలంగాణ ఎంపీలు కూడా అదే పనిగా పోరాడుతున్నారు. కానీ వైసీపీ ఎంపీలు మాతరం నోరెత్తడం లేదు.
కానీ వారు యుద్ధం ఆపడం లేదు. ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి.. చంద్రబాబును తిడుతున్నారు. ఎంపీలు విడతల వారీగా రోజూ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యం అయింది.. చంద్రబాబు వల్లే ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది.. వరద బాధితులెవరికీ నష్టం లేదు.. వారంతా హాయిగా.. సుఖంగా ఉన్నారు.. పరిహారం రూ. రెండు వేలు చంద్రబాబుకే అందలేదు..అందరికీ అందింది వంటి కబుర్లు చెబుతున్నారు. జగన్ పనితీరును పొగుడుకుంటున్నారు. చంద్రబాబును నానా తిట్లు తిడుతున్నారు వారి దృష్టిలో అదే యుద్ధమన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది.
రాష్ట్రానికి మేలు చేయకపోయినా.. కనీసం చెడు జరగకుండా అడ్డుకోవడం ఎంపీల కనీస బాధ్యత. అలా చేయకపోతే… తమను ఎంపీలుగా ఢిల్లీకి పంపిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడమే. ఎంపీలు అదే చేస్తున్నారు. ఎంత సేపూ చంద్రబాబును తిట్టి… జగన్ను పొగుడుకుంటే చాలని అనుకుంటున్నారు. అదే యుద్దంగా చేసేస్తున్నారు. ఈ యుద్ధం వల్ల ఎవరికి లాభమో.. ఎంపీలే తేల్చుకోవాల్సిఉంది.