ఆంధ్రప్రదేశ్లో పోలవరం కేంద్రంగా రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసిత ప్రాంతాల్లో పర్యటించి .. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి రూ. ఇరవై వేల కోట్లు కావాలని కేంద్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కేంద్రంపై యుద్ధం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు పోలవరం కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంపీలతో పాటు సీఎం జగన్ కూడా రాజీనామా చేస్తే కేంద్రం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఎందుకివ్వదో చూద్దామని చంద్రబాబు అంటున్నారు.
గతంలో ప్రత్యేకహోదా కోసం రాజీనామాల డిమాండ్ వినిపించేది. ఇరవై ఐదు మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు ప్రత్యేకహోదా రాదో చూద్దామని జగన్ చెప్పేవారు. ఎంపీలతో రాజీనామా చేయించారు. కానీ ఆరు నెలలపదవీ కాలం ఉన్నప్పుడే రాజీనామాలు చేయించడంతో ఉపఎన్నికలు రాలేదు. ఇప్పుడు పోలవరం అంశంపై రాజీనామాల డిమాండ్ తెరపైకి వచ్చింది. టీడీపీ ఎంపీలు.. వైసీపీ ఎంపీలురాజీనామా చేస్తే తాము కూడా చేస్తామని అంటున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్. వంద శాతం కేంద్రం భరించాలి. కానీ ఈ విషయంలో కేంద్రం అంత వేగంగా స్పందించడం లేదని ముఖ్యమంత్రే చెబుతున్నారు.
అప్పట్లోఎందుకు రాజీనామాలు చేయలేదని సజ్జల ప్రశ్నించారు. అప్పట్లో టీడీపీ రాజీనామాలు చేయలేదు కాబట్టి ఓడిపోయారు.. ఇప్పుడు వైసీపీ చేయకపోయినా అదే పరిస్థితి వస్తుంది కదా అంటే వైసీపీ నేతల దగ్గర సమాధానం ఉండదు. ఇలాంటి డౌట్స్ వస్తే కొడాలి నాని వంటి వారిని రంగంలోకి దింపి.. టీడీపీ నేతల్ని బండ బూతులు తిట్టిస్తున్నారు. కానీ అది సమస్యకు పరిష్కారం కాదు. కనీసం రాజీనామాల చర్చను కూడా పక్కదోవ పట్టించుదు. కొడాలి నాని బూతులు ఇప్పుడు రొటీన్ అయిపోయాయి. మరి టీడీపీ డిమాండ్ చేస్తున్నట్లుగా రాజీనామాల సవాళ్లను ముందుకు తీసుకెళ్తారా లేకపోతే… ఎదురుదాడి చేసి సర్దుకుంటారా అన్నది వేచి చూడాలి.