ఢిల్లీ రాజకీయాల్లో కేసీఆర్‌ను కలిసేందుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. చివరికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాలని కూడా విపక్షం కోరడం లేదు. కేసీఆర్ నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నా ఒక్క ఎస్పీ నేత అఖిలేష్ తప్ప ఎవరూ కలవలేదు. సీక్రెట్ మీటింగ్స్ కూడా జరగలేదని చెబుతున్నారు. అఖిలేష్ గెలిస్తే గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఇతరులు కలిస్తే ఎందుకు సీక్రెట్‌గా ఉంచుతారని అంటున్నారు.
కేసీఆర్ అలా ఢిల్లీ వెళ్లగానే ఇలా పెద్ద ఎత్తున నేతలు వచ్చి కలుస్తారని అనుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం అయినా వచ్చి కలుస్తారని అనుకున్నారు. కానీ ఎవరూ కలవలేదు. తమ పీఆర్ టీంతో ఇతర పార్టీల నేతల్ని పిలిపించుకునే ప్రయత్నం చేశారు. యూపీ ఎన్నికల్లో సాయం చేసినందున ఒక్క అఖిలేష్ మాత్రం పాజిటివ్‌గా స్పందించారని అంటున్నారు.బీహార్ యువ నేత తేజస్వి యాదవ్‌ను కూడా పిలిచారు. కానీ ఆయన వస్తానని చెప్పి హ్యాండిచ్చారు.
ఇలా కొంత మంది నేతలు వచ్చి కలుస్తామని చెప్పి వెళ్లలేదు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా పట్టించుకోలేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ఊపు తీసుకు రావడం లేదన్న అభిప్రాయం ఢిల్లీలో వినిపిస్తోంది. మరో వైపు అప్పుల కోసం ఢిల్లీలో కొన్ని కీలక సమావేశాలు నిర్వహించారు. అంతకు మించి ఆయన ఢిల్లీలో ఏమీ చేయలేకపోయారని అంటున్నారు. ఇప్పటికైతే.. కేసీఆర్‌తో కలవడం కానీ.. కేసీఆర్‌ను కలుపుకు పోవడం కానీ చేసే ఉద్దేశం ఇతర పార్టీలకు లేదని .. ఢిల్లీలో ఓ క్లారిటీ వచ్చేసిందంటున్నారు.