కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీతో మైండ్ గేమ్ ఆడుకుంటున్నారు. తనను సీఎం స్థాయి అభ్యర్తిగా గుర్తించాలన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. కేసీఆర్తో యుద్ధం ప్రకటిస్తున్నానని చెబుతున్నారు. బీజేపీతో చేరడం అంటే.. కేసీఆర్పై జరిగే యుద్ధానికి తానే నేతృత్వం వహిస్తున్నానని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో కమలం పార్టీలో కలకలం ప్రారంభమయింది. ఆ స్థాయి హోదా కోసమే రాజగోపాల్ రెడ్డి నాన్చుతున్నాడని బీజేపీ నేతలకు అర్థం అయింది.
పార్టీ మారకపోతే చారిత్రక తప్పిదమే అవుతుందని స్వయంగా చెప్పిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ను వీడడం ఖాయమని పలు సందర్భాల్లో చెప్పారు. మోడీ నేతృత్వంలో దేశం, రాష్ట్రం బాగుపడుతుందని కూడా బీజేపీని పొగడ్తలతో ముంచెత్తారు. టీఆర్ఎస్ మీద యుద్ధం ప్రకటించక తప్పదని, రానున్న ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం ఏర్పడడానికి మునుగోడు వేదిక అవుతుందని చెబుతున్నారు. మునుగోడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాననిగానీ, బీజేపీలో చేరుతున్నట్లుగానీ ఇప్పటివరకు స్పష్టం చేయలేదు.
కానీ రాజగోపాల్ రెడ్డి చేరిపోతారని బీజేపీ నేతలు ప్రచారం చేసుకున్నారు. ఇలాంటి ఎఫెక్ట్ కోసమే చూస్తున్న రాజగోపాల్ రెడ్డి వారికి షాకులిస్తున్నారు. ఆయన చేరిక ఖాయమో లేదో కూడా తేల్చుకోలేని అయోమయంలో బీజేపీ నేతలు పడ్డారు. బీజేపీలో తానే సీఎం అభ్యర్థినని గతంలో బీజేపీలో చేరేందుకు ప్రయత్నించిన సమయంలో ప్రచారం చేసుకున్నారు.ఆ ఆడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు కూడా అలాగే ప్రచారం చేసుకుంటున్నారని ఆ స్థాయి ప్రాధాన్యం కోసమే బీజేపీతో మైండ్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు. పరిస్థితి చూస్తే అలాగే ఉందని బీజేపీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు.