తెలంగాణ బీజేపీలో కనిపించని సంక్షోభం అంతకంతకూ పెరిగిపోతోంది. బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ అనేది బయటకు కనిపిస్తోంది. తనకు తిరుగులేని బండి సంజయ్ అనుకుంటున్నారు. కానీ ఈటల రాజేందర్ వ్యూహాత్మకంగా నేరుగా కేసీఆర్‌ను ఢీకొట్టి.. ఆయనకు ధీటైన నేతను తానేనని ఫ్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం చాలెంజ్‌ల బాట ఎంచుకున్నారు. గజ్వేల్‌లో తనకు తానే టిక్కెట్ ప్రకటించుకున్నారు. కేసీఆర్‌పై పోటీ చేయబోయేది తానేనని చెప్పుకున్నారు.
ఆ టెంపోను అలా కొనసాగిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. కేసీఆర్ హుజూరాబాద్ వచ్చి పోటీ చేసినా పర్వాలేదన్నారు. ప్లేస్ ఆయనే డిసైడ్ చేసుకోవాలని..ఆయనను ఓడించేది తానేనని అంటున్నారు. ఈటల హడావుడి చూసి.. కేసీఆర్‌తో ఈటల తలపడుతున్నారన్న అభిప్రాయం వచ్చేలా ఉండటంతో బండి సంజయ్ ఉలిక్కి పడ్డారు. వెంటనే ఆయన ఈటల తీరును పరోక్షంగా ఖండించారు. బీజేపీలో ఎవరికి వారు టిక్కెట్లు ప్రకటించుకునే సంప్రదాయం లేదని.. తనకు కూడా కరీంనగర్, వేములవాడ, ఎల్పీనగర్ అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ హైకమాండే టిక్కెట్లు ఇస్తుందన్నారు.
తనను ఉదాహరణగా చూపించుకున్నా.. బండి సంజయ్ అసలు టార్గెట్ చేసింది ఈటల రాజేందర్నేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పార్టీలో ప్రాధాన్యం దక్కపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని తెలిసి ఇటీవల హైకమాండ్ పిలిచి మాట్లాడింది. ఆయనకు చేరికల కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చింది. కానీ చేరే వారే పెద్దగా కనిపించడం లేదు. ఈటల ద్వారా పార్టీలో చేరితే గుర్తింపు ఉండదన్న ప్రచారం ఆ పార్టీలోనే సాగుతోంది. మొత్తంగా తెలంగాణ బీజేపీ అంతర్గత రాజకీయాలు ఆ పార్టీలో చేరికలపై ప్రభావం చూపుతున్నాయి.