కడపలో రూ. రెండు కోట్ల వరకూ పలికిన బార్.. విశాఖ, గుంటూరు, విజయవాడ వంటి చోట్ల.. బేస్ ప్రైస్‌కు కొద్ది ఎక్కువ మాత్రమే చూపించి కైవసం చేసుకున్నారు. ఇక్కడ ఎంత ఘోరమైన దోపిడి జరిగిందో స్పష్టంగా కనిపిస్తోంది. పేరుకే బహిరంగ వేలం.. కానీ అంతా ముసుగులో జరిగిపోయింది. అంతా సిండికేట్ అయిపోయి.. బార్లను సొంతం చేసుకున్నారు. ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం సైలెంట్‌గా ఉంటోంది.
మద్యనిషేధం అనే హామీని సైతం తుంగలో తొక్కి బార్లకు వేలం పాటలు నిర్వహించారు. భారీ ఆదాయాన్ని ఆశించారు. ఆశించిన దాని కన్నా ఎక్కువ మొత్తమే వచ్చే చాన్సులు కనిపించాయి. ఓ రకంగా వచ్చాయి కూడా. కానీ దాన్ని వైసీపీ నేతలు పంచేసుకున్నారు. ఒక్కో బార్‌కు కనీసం కోటిన్నర లైసెన్స్ ఫీజు కింద వచ్చేది. తక్కువ జనాభా ఉన్న కడపలోనే అంత పెద్ద మొత్తం వచ్చినప్పుడు ఇతర పెద్ద నగరాల్లో ఇంకెంత రావాలి ? కానీ వైసీపీ నేతలు సెటిల్మెంట్లు చేసి .. ఖజానాకు రావాల్సిన ఆదాయానికి గండికొట్టారు. దీనికి సాక్ష్యాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు.. ఇలా వైసీపీ నేతలు పంచుకున్నప్పుడు ఏ ప్రభత్వమైనా ఏం చేయాలి.. ? తక్షణం వేలం పాటల్ని రద్దు చేసి.. మళ్లీ కొత్తగా బార్లకు వేలం నిర్వహించాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం ఖజానాకు చేరాల్సిన సొమ్మును సొంతం చేసుకుంది సొంత పార్టీ నేతలే కదా అన్నట్లుగా సైలెంట్‌గా ఉంటోంది. కళ్ల ముందు జరుగుతున్న ప్రజాధనం దోపిడిని చూస్తూ ఊరుకుంటోంది. పైకి మాది అవినీతి లేని పాలన అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. పిల్లి కళ్లు మూసుకున్నట్లుగానే ప్రభుత్వ వ్యవహారం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజాధనాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం తన విధిని విస్మరిస్తే పాలనలో విఫలమైనట్లే..!