టాలీవుడ్ `హిట్టు` మొహం చూసి చాలా కాలమైంది. వారానికి నాలుగైదు సినిమాలొస్తున్నా, అందులో ఒక్కటి కూడా గట్టెక్కడం లేదు. కనీసం `యావరేజ్` దగ్గర కూడా ఆగడం లేదు. వచ్చిందల్లా డిజాస్టరే. ఈ దెబ్బకు నిర్మాతలు, బయ్యర్లు కుదేలైపోతున్నారు. థియేటర్ల దగ్గర జనాలు లేక.. ఆటలు రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే… ఏపీలోని 400 థియేటర్లని తాత్కాలికంగా మూసేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. అన్ని థియేటర్లకూ తాళాలు వేయాల్సిన ప్రమాదం.
ఎన్ని ఫ్లాపులు వచ్చినా, ఎప్పటికప్పుడు కొత్త ఆశలు చిగురిస్తూఏ ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి కూడా అదే. జులై గట్టి దెబ్బ కొట్టినా, ఆగస్టుపై ఆశలు ఉన్నాయి. ఈ నెలలో మంచి సినిమాలే వస్తున్నాయి.వాటిపై అన్నో ఇన్నో అంచనాలు ఉన్నాయి. ఈనెల 5న బింబిసార, సీతారామం వస్తున్నాయి. ఒకటి లవ్ స్టోరీ, మరోటి సోషియో ఫాంటసీ. ప్రచార చిత్రాల వరుస చూస్తుంటే ఈ రెండు సినిమాల్లోనూ హిట్ లక్షణాలు కనిపిస్తున్నాయి. లవ్ స్టోరీ ఎవర్ గ్రీన్ జోనర్. దుల్కర్, రష్మిక, హను రాఘవపూడి… ఇవన్నీ థియేటర్లకు రప్పించే పేర్లే. పైగా పాటలు, ట్రైలర్.. ఆకట్టుకొంటున్నాయి. మరోవైపు బింబిసార.. సోషియో ఫాంటసీ కథతో వస్తున్నాడు. ఈ జోనర్ కి మినిమం గ్యారెంటీ ఉంది. టైమ్‌ట్రావెల్ కథ కాబట్టి.. ఉత్సుకత రేపుతోంది. దానికి తోడు.. ఈ సినిమా గ్యారెంటీ హిట్టు అని ఎన్టీఆర్ కూడా భరోసా కల్పించాడు. సో.. ఈ రెండు సినిమాలతో.. ఆగస్టు నెల ఆశావాహంగా మొదలవ్వబోతోంది.
ఈనెల 12న మరో రెండు సినిమాలొస్తున్నాయి. మాచర్ల నియోజక వర్గం ఒకటైతే, కార్తికేయ 2 మరోటి. ఇవి కూడా రెంటికి రెండూ డిఫరెంట్ జోనర్లే. మాచర్ల.. ఫుల్ మాస్ అయితే.. కార్తికేయ థ్రిల్లర్. నితిన్ మాస్ డైలాగులు, ఫైట్లూ… పాటలూ హై ఓల్టేజీలో సాగుతున్నాయి. మాస్ సినిమా క్లిక్ అయితే ఆ హంగామా వేరేలా ఉంటుంది. నితిన్ పాస్ మార్కులు తెచ్చుకొన్నా – హిట్టు గ్యారెంటీ. కార్తికేయ సూపర్ హిట్టవ్వడంతో.. సీక్వెల్ వస్తోందిప్పుడు. కాబట్టి… దీనిపైనా ఆశలు పెంచుకోవొచ్చు. నిఖిల్ థ్రిల్లర్ కథ ఎప్పుడు ఎంచుకొన్నా హిట్టు కొట్టాడు. సో.. అదో నమ్మకం. అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్… ఇలా పోస్టర్‌పై ఆకర్షణీయమైన పేర్లు కనిపిస్తున్నాయి.
ఇక ఆగస్టు 25న లైగర్ వచ్చేస్తున్నాడు. పూరి – విజయ్ ల కాంబోలో రూపొందించిన పాన్ ఇండియా సినిమా ఇది. ఇప్పటికే మార్కెట్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ట్రైలర్‌తోనూ పూరి అదరగొట్టేశాడు. విజయ్‌కి ఉన్న క్రేజ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ కానుంది. దాంతో పాటు.. ఇస్మార్ట్ శంకర్ తరవాత పూరి ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. అదనంగా.. మైక్ టైసన్ ఉండనే ఉన్నాడు. బిజినెస్ పరంగా పూరి పూర్తి సంతృప్తితో ఉన్నాడు. మరి.. బాక్సాఫీసు రిజల్ట్ కూడా ఓకే అనిపించుకొంటే… ఆగస్టులో దుమ్ము లేవడం ఖాయం.
వీటితో పాటుగా ఈ నెలలో మరో ఆరేడు చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. వాటిలో ఒకట్రెండు హిట్టయినా… గత రెండు మూడు నెలల నుంచీ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ కు కాస్తలో కాస్త ఊరట లభిస్తుంది.