ప్రవీణ్ చీకోటి కేసినో బిజినెస్ అడ్డాగా.. హవాలాను రూ. వందల కోట్లలో చేశాడని ఈడీ అధికారులు గుర్తించడంతో అసలు సినిమా రాజకీయాల్లో కనిపించే అవకాశం కనిపిస్తోంది. గన్నవరం ఎమ్మెల్యే తనకు ప్రాణస్నేహితుడని చికోటి చెప్పడమే కాదు ఫోటోలతో సహా వెల్లడించారు. ఇక గుడివాడలో కేసినో నిర్వహణ ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది. ఈ క్రమంలో ఆయనపై ఈడీ దాడులు జరగడం.. లావాదేవీలన్నీ బయటకు లాగాలని నిర్ణయించడంతో రాజకీయంగానూ సంచలనం అవుతోంది.
సోమవారం నుంచి చికోటిని ఈడీ ప్రశ్నించనుంది. దీంతో చాలా మంది రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పెరుగెడుతున్నాయి. రాజకీయభవిష్యత్కు ముడిపడిన అంశం కావడంతో చికోటి ఇంటి చుట్టూ ఆయన నేతల అనుచరులు చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు భయపడిపోయి భద్రత కావాలని పోలీసులకు మొరపెట్టుకున్నారు. ఇప్పుడు చికోటి ప్రవీణ్ నిజంగానే తన లావాదేవీలన్నింటినీ ఈడీకి వెల్లడిస్తే రాజకీయ నేతలంతా బుక్కయిపోతారు. ఇలాంటి వారిలో ఏపీ నుంచే ఎక్కువ మంది ఉన్నారన్న చర్చ జరుగుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో చీకోటిని లైట్ తీసుకున్నారు. మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నప్పటికీ.. ఓ జడ్పీ చైర్మన్ కేసినోకి వెళ్లాడని తేలినప్పటికీ అంతగా ప్రభావిత అంశంగా బయటకు రాలేదు. కానీ ఏపీలో మాత్రం చాలా మంది పేర్లతో సహా వెలుగులోకి వస్తున్నాయి. వీరి పేర్లు నిజంగానే చీకోటి ఈడీ అధికారులకు చెప్పినా… వారు హవాలా సొమ్ము ఇచ్చినట్లుగా ఆధారాలు చిక్కినా నోటీసులు జారీ చేయడం ఖాయం. ఈ ఏ ఒక్క రాజకీయ నేతకు నోటీసులు వచ్చినా అది సంచలనం అయ్యే అవకాశం ఉంది. అందుకే చికోటి ఈడీ విచారణపై అంతటా ఆసక్తి వ్యక్తమవుతోంది.
సాధారణంగా ఈడీ విచారణ జరుపుతూంటే వివరాలన్నీ బయటకు వస్తూంటాయి. డ్రగ్స్ కేసుల్లో వాళ్లేం చెప్పారో కథలు కథలుగా ఈడీవర్గాలు మీడియాకు లీక్ చేశాయి.ఇప్పుడు చికోటి వ్యవహారంలో ఇలా చేసినా సంచలనమే అవుతుంది.