తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మోదీ నేతృత్వంలో జరగనున్న కమిటీ సమావేశానికి ఆహ్వానం వచ్చింది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ” ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ” జాతీయ కమిటీ సమావేశంలో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇందు కోసం ఆయన ఆరో తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో ఈ సమావేశం జరగనుంది.
భారత్కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా 2023 వరకు ఉత్సవాల నిర్వహణకు భారత ప్రభుత్వం ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా నిర్వహించే సన్నాహక సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఉత్సవాల నిర్వహణ జాతీయ కమిటీలో చంద్రబాబును సభ్యుడిగా చేశారు. ఇది రాజకీయాలకు సంబంధం లేని కార్యక్రమం. ఉత్సవాల్లో అందర్నీ భాగస్వాముల్ని చేయాలని కేంద్రం అనుకుంటోంది. ఆ మేరకు పార్టీలకు అతీతంగా ఆహ్వానాలు పంపుతున్నారు.
అయితే ఏపీలో ఏదైనా రాజకీయమే. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబుతో మోదీ భేటీకాలేదు. కరోనా పరిస్థితుల్లో దేశంలో సీనియర్ నేతలందరికీ మోదీ ఫోన్లు చేశారు కానీ చంద్రబాబుకు చేయలేదు. అయితే చంద్రబాబే చేసి మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించడం.. ఏపీ రాజకీయాల్లో కాస్త చర్చనీయాంశం అవడం ఖాయంగా కనిపిస్తోంది.