ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సోషల్ మీడియా డీపీలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. రెండో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకూ అందరూ మూడు రంగుల జెండాను డీపీగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. అయితే నిర్బంధం ఏమీ కాదు. కాకపోతే దేశభక్తికి కొలమానంలా దీన్ని చూసే చాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇలాంటి ఈవెంట్స్ పెట్టడంలో ఎప్పుడూ హుషారుగా ఉంటారు. గతంలో చప్పట్లు కొట్టడం..లైట్లు ఆర్పేయడం.. క్యాండిల్స్ వెలిగించడం వంటివి చేసి చూపించారు. ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇప్పుడు కూడా వాట్సాప్ డీపీలు మార్చేస్తారాలేదా అన్నది చెప్పలేం కానీ ఎక్కువ మంది మార్చకపోవచ్చు.ఎందుకంటే మన దేశంలో సోషల్ మీడియా వాడేవాళ్లలో డీపీలు పెట్టుకోవడం తెలియని వాళ్లు తక్కువేమీ కాదు. మోదీ ఇలా పిలుపునిచ్చిన అంశం తెలియని వాళ్లూ ఉంటారు. ఏం పెట్టుకోకపోతే మాకు దేశభక్తిలేనట్లా అని రెటమతానికి పోయేవాల్లు కొంత మంది ఉంటారు. అదే సమయంలో దేశ భక్తి అంటే.. మనల్ని.. మన కుటుంబాన్ని..మన చుట్టుపక్కనల ఉన్న వారిని మానవత్వంగా చూడటమే అని భావించేవాళ్లూ ఉంటారు. అలాంటి వారు నినాదాలకు.. ఈవెంట్లకు పెద్దగా స్పందించారు.
కారణం అదైనా75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జనం కూడా బాగా ఫీలయ్యేలా నిర్వహించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఎప్పటికప్పుడు వారిని భాగస్వామ్యం చేస్తోంది. ఈ క్రమంలో హర్ ఘర్ కి తిరంగా పేరుతో ప్రతి ఇంటిపై జాతీయ జెండాఎగురవేయాలని నిర్ణయించారు. ఇప్పుడు ప్రజల సోషల్ మీడియా ఖాతాల్లోకీ జాతీయ జెండా వచ్చి చేరుతోంది. దేశభక్తి అంటే ఇదేనా అని చాలా మంది అనుకోవచ్చు.. కానీ ఇదికూడా దేశభక్తే అనుకోవాలి. దేశభక్తిఉండటమే కాదు..ప్రదర్శించుకోవడం కూడా తెలిసి ఉండాలి మరి.