కాపుల ఓట్లను పవన్ కల్యాణ్ గుంపగుత్తగా అమ్మేస్తారని.. వారు అమ్ముడుపోయే వాళ్లన్నట్లుగా సీఎం జగన్ … నేరుగా గోదావరి జిల్లాల్లో జరిగిన సభలో వ్యాఖ్యానించి రెండు రోజులవుతోంది. కానీ కాపు నేతల నుంచి కనీస స్పందన కూడా కనిపించడం లేదు. కాపుల్ని నట్టేట ముంచారని జగన్‌పై ఇప్పటికే ఆ వర్గంలో ఆగ్రహం ఉంది. అందరికీ ఇచ్చే పథకాలకు తమకూ ఇస్తూ.. తమకేదో ప్రత్యేక సాయం చేస్తున్నట్లుగా ప్రకటించుకోవడమే కాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల దగ్గర నుంచి స్వయం ఉపాధి పథకాలు.. కాపు బిడ్డలకు విదేశీ విద్యా సాయం వరకూ అన్నీ నిలిపివేసి .. దారుణంగా వంచించారన్న అభిప్రాయంలో ఉన్నారు.
ఇంత దారుమంగా మోసం చేసిన తర్వాత కూడా .. తాము అమ్ముడుపోయే వాళ్లమన్నట్లుగా జగన్ వ్యాఖ్యలు చేయడం చాలా మందికి రుచించడం లేదు. తమ నేతల స్పందన కోసం వారు ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై కాపు గ్రూపుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి తమను మరీ ఇంత తేలికగా తీసేసుకుంటున్నారని.. వారు మండిపడుతున్నారు. ఈ ఆగ్రహం బయటకు కనిపిస్తూండటంతో కొంత మంది ఇతర పార్టీల నేతలు నోరెత్తుతున్నారు. వైసీపీలోని కాపు నేతలుకూడా మాట్లాడాలంటున్నారు.
పవన్ కల్యాణ్‌కు కాపు ఓటర్లు మాత్రమే మద్దతు పలుకుతున్నట్లుగా జగన్ చెప్పదల్చుకున్నారు. దీనిపై జనసేన వైపు నుంచి కౌంటర్ రాలేదు. పవన్ కల్యాణ్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో టైమ్లీగా స్పందించడం లేదు. దీంతో కాపు సామాజికవర్గం యువతలో తాము అవమానానికి గురవుతున్నామని.. ఈ దుస్థితికి కారణం ఏమిటన్న చర్చ నడుస్తోంది. రిజర్వేషన్లు తీసేసినప్పటినుంచి కాపు వర్గానికి మేలు చేసే అన్ని పథకాలు తీసేసినా పట్టించుకోకపోవడంతో వైసీపీ అధినేతలో తమపై చులకున భావం ఏర్పడిందని అభిప్రాయానికి వస్తున్నారు. దీనిపై ముద్రగడ లాంటి వాళ్లు స్పందించకపోవడం కూడా ప్రశ్నిస్తున్నారు.