ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ విషయంలో బీజేపీ సాఫ్ట్‌గా వ్యవహరిస్తోంది. కొత్తగా గౌరవం కూడా ఇస్తోంది. ఇది జాతీయ నేతల నుంచే కాదు రాష్ట్ర నేతల నుంచి కూడా కావడం ఆశ్చర్యకర పరిణామం. నిజానికి బీజేపీ మద్దతు వల్ల కానీ.. పొత్తు పెట్టుకోవడం వల్ల కానీ ఏపీ రాజకీయ పార్టీలకు ప్రయోజనం ఉండదు. కానీ ఢిల్లీలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీగా .. ” ఎక్స్టర్నల్” ఎఫెక్ట్స్ కోసం మాత్రం బీజేపీ మద్దతు తీసుకోక తప్పదు. మద్దతు తీసుకోకపోయినా ఆపార్టీకి వ్యతిరేకగా వెళ్లలేరు.
అందుకే ఇంత కాలం ఏపీలోని రెండు రాజకీయ పార్టీలు సైలెంట్ అయ్యాయి. మోదీపై యుద్ధం ప్రకటించి… ఓడిపోయిన చంద్రబాబు ఆ తర్వాత మౌనం దాల్చారు. వీలైనంతగా సంబంధాలు పెంచుకునేందుకే ప్రయత్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత పోరాడినా ప్రజలు మద్దతివ్వకపోవడం ఓ అంశం అయితే.. బీజేపీతో కయ్యం పెట్టుకోవడం వల్ల నష్టం తప్ప.. లాభం లేదని గుర్తించడం మరో కారణం. అయితే చంద్రబాబును ఇంత కాలం బీజేపీ దగ్గరకు తీయలేదు. ఇప్పుడూ తీయడం లేదు. కానీ గతంలో ఉన్న ఓ వ్యతిరేకతను మాత్రం తగ్గించుకున్నట్లుగా కనిపిస్తోంది.
గతంలో కరోనా సమయంలో దేశంలోని సీనియర్ నేతలందరికీ ఫోన్లు చేసి సలహాలు అడిగిన మోదీ చంద్రబాబును మాత్రం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ భేటీకి ఆహ్వానించారు. ఏపీలో బీజేపీ నేతలు.. తమతో చంద్రబాబు కలిసి ఉంటే అమరావతి పూర్తయ్యేదేని.. జగన్ గెలిచి ఉండేవారు కాదని అంటున్నారు. నిజానికి ఇలా అంటున్న నేతలే… పొత్తులో ఉన్నప్పుడు చంద్రబాబును నానా మాటలు అని.. పొత్తు లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు.
వైసీపీ మూడు రాజధానులకు పరోక్షంగా మద్దతు పలికి అమరావతి నిర్వీర్యం కావడానికి కారణం అయిన బీజేపీ రాజకీయాలపై ప్రజలకు అవగాహన ఉంది. అయినప్పటికీ.. అమరావతిలో పాదయాత్ర చేసి.. తామే అమరావతి పరిరక్షకులం అని వాదిస్తూ వస్తున్నారు. అక్కడ రైతులు బీజేపీ తీరును ఎడగడుతున్నా.. ఫీల్ కావడం లేదు. అదో టాస్క్‌లా చేస్తున్నారు. మొత్తంగా … ఏపీ రాజకీయాల్లో బీజేపీ తీరు కీలక మార్పులకు కారణం అయ్యే అవకాశం ఉంది.