దేశానికి కొత్త పార్లమెంట్ బిల్డింగ్ సిద్ధమవుతోంది. తెలంగాణకు కొత్త సచివాలయం రెడీ అవుతోంది. అలాగే త్వరలో కొత్త అసెంబ్లీ భవనం కూడా సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం అదే ఆలోచనలో ఉంది. ఈ విషయాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి నేరుగానే ప్రకటించారు. సచివాలయం పూర్తయిన తర్వాత అసెంబ్లీ బిల్డింగ్ కడతామని చెబుతున్నారు . సచివాలయం ఎప్పటికో పూర్తి కావాల్సి ఉంది. కానీ ఎన్నో రకాల సమస్యలు అడ్డం పడ్డాయి. నిర్మాణాలు ప్రారంభమైన తర్వాత కరోనా వచ్చింది.
అయితే ఇప్పటికి సచివాలయానికి ఓ రూపు వచ్చింది. మరో ఐదారు నెలల్లో ఇంటీరియర్ సహా మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సచివాలయంలోకి అడుగు పెట్టిన తర్వాత కేసీఆర్ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఎన్నికలకు ముందుగానే అసెంబ్లీ నిర్మాణ పనులు ప్రారంభిస్తారా లేదా అన్నది మాత్రం మంత్రి చెప్పలేదు. అలాగే ఎక్కడ నిర్మిస్తారన్నది కూడా సస్పెన్సే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనం కూల్చేందుకు నిబంధనలు అంగీకరించరు.
నిబంధనలే కాదు ప్రజల్లోనూ వ్యతిరేకత వచ్చే చాన్స్ ఉంది. హైదరాబాద్కుఓ బ్రాండ్ సింబల్లాగా ఆ భవనం ఉంది. అక్కడ కూల్చివేయకపోతే కొత్త చోట కట్టాలి అంత స్థలం ఎక్కడ ఉందనేది ఇప్పుడు కీలకం. ఇక సిటీ మధ్యలో కాకుండా శివార్లలో విశాలమైన ప్రదేశంలో కట్టుకోవాలనుకుంటే మాత్రం కావాల్సినంత చాయిస్ ఉంది. మరి తెలంగాణ సర్కార్ ఆలోచనల్లో ఏముందో మరి !