ఓ సినిమాలో పనిచేసిన హీరో, హీరోయిన్లూ… బయట ఎలా ఉన్నా, మీడియా ముందు మాత్రం సఖ్యత కనబరుస్తారు. `ఈ హీరోతో పనిచేయడం ఎంతో హ్యాపీ` అని హీరోయిన్ అంటే, `అసలు ఇంత డెడికేషన్ ఉన్న హీరోయిన్ని చూడలేదు` అంటూ – హీరో కూడా ఆమెని పొగిడేస్తుంటాడు. ప్రమోషన్లలో వినిపించే రొటీన్ జవాబులు ఇవే. అయితే.. `కార్తికేయ 2` విషయంలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో నిఖిల్ విరివిగా పాల్గొంటే, అనుపమ పరమేశ్వరన్ మాత్రం కనిపించడం లేదు. దాంతో నిఖిల్ ఆమెపై కోపంగా ఉన్నాడు. ”అనుపమ సెట్లో బాగానే ఉంటుంది. నవ్వుతూ మాట్లాడుతుంది. ఒక్కసారి పేకప్ చెప్పేస్తే.. ఫోన్లు తీయదు. మెసేజీలకు సమాధానాలు ఇవ్వదు. ‘ప్రమోషన్లు ఉన్నాయి… రావాలి అని అడిగితే కనీసం రిప్లై ఇవ్వలేదు. సెట్లో మాత్రం అందరితోనూ బాగుంటుంది. తనకు రెండు ముఖాలున్నాయేమో” అంటూ అంటీ అంటించనట్టు చురక వేసేశాడు.
దీనికి అనుపమ కూడా గట్టిగానే రిప్లై ఇచ్చింది. `కార్తికేయ 2` ప్రమోషన్లకు రావడం వీలు కావడం లేదని, వరుసగా రెండు సినిమాల షూటింగులు జరుగుతున్నాయని, పగలూ, రాత్రీ అనే తేడా లేకుండా పనిచేస్తున్నానని క్లారిటీ ఇచ్చింది. ఇది వరకు కార్తికేయ రిలీజ్ డేట్ పలుసార్లు వాయిదా పడిందని, అందుకే.. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ సమయంలో… ప్రమోషన్లకు తన దగ్గర సమయం లేకుండా పోయిందని ఇన్స్టాలో చెప్పుకొచ్చింది. సో.. ఓ రకంగా.. తను ప్రమోషన్లకు రావకపోవడానికి కారణం.. చిత్రబృందమే అని పరోక్షంగా చెప్పేసిందన్నమాట. కార్తికేయ 2 ఈనెల 12న వస్తోంది. అంటే మరో పది రోజులు మాత్రమే సమయం ఉందన్నమాట. చివరి నాలుగైదు రోజులైనా అనుపమ ఈ ప్రమోషన్లలో కనిపిస్తుందని చిత్రబృందం నమ్మకం పెట్టుకొంది. అయితే అనుపమ వచ్చే పరిస్థితి లేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. వ్యవహారం చూస్తుంటే… సెట్లో నిఖిల్ కీ, అనుపమకీ ఏదో అయ్యే ఉంటుందనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.