సోషల్ మీడియా యాక్టివిజం… ముఖ్యంగా రాజకీయ పార్టీలు పెంచి పోషించే సోషల్ మీడియా సైన్యాలు ఏమీ లేని చోట కూడా వివాదాలు రేపి పబ్బం గడుపుకుంటున్నాయి. అదే తమను టార్గెట్ చేసే వారి విషయంలో అయితే మరింత ఎక్కువ. ఈ సారి ఓ మహిళా ఎంపీ వీరికి టార్గెట్ అయ్యారు. పార్లమెంట్లో తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు మహువా మెయిత్రా తన పక్కన సభ్యురాలు మాట్లాడుతూండగా.. తన పక్క చెయిర్లో ఉన్న తన హ్యాండ్ బ్యాగ్‌ను తీసి కింద పెట్టారు. ఇలా పక్కన పెట్టడమే ఆమె తప్పు అయిపోయింది.
వెంటనే బీజేపీకి చెందిన సోషల్ మీడియా సైన్యం రంగంలోకి దిగింది. ఆమె బ్యాగ్‌ను దాచి పెడుతోందని .. అసలు ఆ బ్యాగ్‌ను ఎందుకు దాచి పెడుతున్నారని రచ్చ ప్రారంభిచారు. ఆ బ్యాగ్ ఖరీదు లక్షన్నర అంటూ ఈ కామర్స్ సైట్లలో వెదికి ఆమెపై దాడి ప్రారంభించారు. ఓ ప్రముఖ బ్రాండ్‌కు చెందిన ఆమె చేతి సంచి ఖరీదు ఎంత అయినా ఆమె కష్టార్జితం. ఆమె గతంలో అమెరికా, యూకేల్లో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్‌గా పని చేసి వచ్చారు. శ్రీమంతురాలు. ఆమె ప్రభుత్వానికి బిల్లు పెడితే ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. కానీ ఆమె సొంతంగా కొనుక్కున్నారు.
పైగా ఆ బ్యాగ్ దాచుకుంటున్నట్లుగా ప్రచారం చేశారు. కానీ ఆమె 2019 నుంచి అదే బ్యాగ్ వాడుతున్నారు. ఆ బ్యాగ్‌తోనే ప్రతీసారి కనిపిస్తారు. అందులో దాచుకోవడానికే ఏమీ లేదు. ఆ విషయం ఎంపీనే గతంలో అనేక సందర్బాల్లో తీసిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వివాదం చూసిన చాలా మంది నెటిజన్లు ఇష్టం లేని నేతలపై వ్యతిరేక ప్రచారం చేయాలంటే ఇలా కూడా చేయవచ్చా అని ప్రశ్నిస్తున్నారు.
మహువా మొయిత్రా.. పార్లమెంట్లో మోదీ సర్కార్‌పై విరుచుకుపడే ఎంపీల్లో ఒకరు. మతతత్వాన్ని ..సంకుచితత్వాన్ని ఆమె ధీటుగా ప్రశ్నిస్తారు. ఆమె ప్రసంగాలు పార్లమెంట్లో హైలెట్‌గా నిలుస్తూ ఉంటాయి.