తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉపఎన్నికను సీరియస్‌గా తీసుకుంది. అలా రాజీనామా చేసినట్లుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించగానే ఇలా .. వెంటనే ఉపఎన్నికల కమిటీని నియమిస్తూ ప్రకటన చేశారు. సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ కన్వీనర్‌గా ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. రామిరెడ్డి దామోదర్ రెడ్డి, బలరాంనాయక్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, సంపత్ కుమార్, ఎరావత్రి అనిల్ కుమార్‌లను సభ్యులుగా నియమించారు. మునుగోడు ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన స్ట్రాటజీ, ప్రచారం వంటి వ్యవహారాలను ఈ కమిటీ చూసుకుంటుంది.
రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పూర్తయిన వెంటనే ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు… తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్‌తో సమావేశం అయ్యారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడి పోతారన్న సమాచారం పక్కాగా ఉండంతో ముందుగా తదుపరి ఏం చేయాలన్నదానిపై వ్యూహాలు సిద్దం చేసుకున్నారు. అందుకే అలా రాజీనామా చేయగానే ఇలా ఉపఎన్నికల సన్నాహాలు ప్రారంభించాల్సిందేనని నిర్ణయించారు. అ ప్రకారం వెంటనే స్ట్రాటజీ కమిటీని ఏర్పాటు చేశారు.
ఐదో తేదీన మునుగోడులో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం ద్వారా పార్టీ క్యాడర్ ఎవరూ రాజగోపాల్ రెడ్డితో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లేందుకు చాలా మంది నేతలు సిద్ధంగా లేరని చెబుతున్నారు. పాల్వాయి స్రవంతిని కొద్ది రోజుల కిందట రేవంత్ రెడ్డి పిలిపించి మాట్లాడారు. అప్పట్నుంచి ఆమె కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపితేనే ఆ పార్టీ పరిస్థితిపై వచ్చే ఎన్నికల్లో కాస్త ఆశలు పెట్టుకోవచ్చు. లేకపోతే కష్టమే. అందుకే రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు ముందు నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.