ఈవారం బాక్సాఫీసు దగ్గర రెండు సినిమాలు `ఢీ` కొట్టబోతున్నాయి. ఒకటి సీతారామం అయితే…. రెండోది కల్యాణ్ రామ్ నటిస్తూ నిర్మించిన `బింబిసార`. రెండూ క్రేజీ సినిమాలే. కాబట్టి.. రెండు సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈమధ్య జనాలు సినిమా థియేటర్లకు రావడం మానేశారనే ఆందోళన అలుముకుంటున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలలో దేనికి టికెట్లు ఎక్కువ తెగుతాయన్నది ఇంకాస్త ఇంట్రెస్టింగ్ విషయంగా మారింది.
సీతారామం పూర్తిగా ఓ ప్రేమకథ. దుల్కర్ సల్మాన్, రష్మిక, మృణాల్, సుమంత్, భూమిక, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్… ఇలా స్టార్ కాస్టింగ్ కి కొదవ లేదు. పైగా వైజయంతీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా. `మహానటి`తో సమానంగా అశ్వనీదత్ తన ప్రేమనంతా ఈ సినిమాపై కురిపించేశారు. గీతాంజలి, మరో చరిత్ర లాంటి ప్రేమకథలతో ఈ సినిమాని పోలుస్తున్నారు. పాటలు ఆల్రెడీ హిట్టయ్యాయి. ట్రైలర్ చూస్తుంటే, సినిమా చూడాలన్న ఆసక్తి కనిపిస్తోంది. క్లాస్, ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు రావడం పూర్తిగా మానేసిన ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్లని ఈ సినిమా కచ్చితంగా థియేటర్లకు తీసుకొస్తుందన్న నమ్మకం కలుగుతోంది.
ఇక.. బింబిసారది పూర్తిగా మాస్, యాక్షన్ రూటు. కల్యాణ్ రామ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగిన సినిమా కాబట్టి… కథాంశం కూడా కొత్తగా, ఆసక్తిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సీతారామంతో పోలిస్తే.. పాటలేవీ పెద్దగా క్లిక్ అవ్వలేదు. అయితే మాస్ సినిమా కాబట్టి, యాక్షన్ ఘట్టాలు, విజువల్ ఎఫెక్ట్స్ పై గట్టిగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా సూపర్ హిట్టని బల్లగుద్ది చెబుతున్నాడు. రెండు సినిమాలూ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకొంటే – టాలీవుడ్ కి అంతకంటే ఏం కావాలి? రెండు నెలలుగా హిట్టులేని లోటుని ఈ రెండు సినిమాలూ తీరుస్తాయేమో చూడాలి.