వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఢిల్లీలో బీజేపీకి చిక్కినట్లుగా కనిపిస్తోంది. ఎలా అంటే ఢిల్లీలో ఇటీవల అక్కడి మద్యం ఎక్సైజ్ విధానంలో అవకతవకలు జరిగాయన్న కారణంగా అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు ఆదేశించారు. ఇందులో భారీ అవినీతి జరిగిందని బీజేపీ నేతలు అంటున్నారు. రేపోమాపో సీబీఐ రంగంలోకి దిగనుంది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేస్తారంటూ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ కేసులో ఎంపీ మాగుంట పేరు కూడా వినిపిస్తోంది.
ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ప్రముఖ మద్యం బ్రాండ్లు ఉత్పత్తి చేసే డిస్టిలరీలు ఉన్నాయి. మాగుంట అగ్రోఫామ్స్ పేరుతో ఉన్న కంపెనీ ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ విధానంలో భాగంగా నిర్వహించిన టెండర్లలో పాల్గొని కొన్ని కాంట్రాక్టులను పొందింది. అయితే ఒక్క మాగుంట కంపెనీలే కాకుండా మరికొన్నికంపెనీలు కాంట్రాక్ట్ పొందాయి. వీటిలో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని విచారణకు ఆదేశించడంతో ఇప్పుడు మాగుంట వ్యవహారం రసకందాయంలో పడిందని అంటున్నారు. విచారణ ప్రారంభమైతే.. మాగుంటకూ చిక్కులు తప్పవని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.
అయితే మాగుంటను బీజేపీలోకి ఆకర్షించే ఉద్దేశంతోనే ఇలాంటి విచారణలు జరుగుతున్నాయన్న అనుమానాలు వైసీపీలో వినిపిస్తున్నాయి. మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీతో అంటీ ముట్టనట్లుగా ఉన్నారు. ఆయన వ్యాపారాలను కూడా జగన్ దెబ్బతీశారు. పార్టీలో ఆధిపత్య పోరాటంతో ఆయనకు గుర్తింపు రాలేదు. ఆయన పార్టీ మారుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో ఆయనకు ఢిల్లీ నుంచి సీబీఐ చిక్కులు రావడం యాధృచ్చికమా.. లేకపోతే రాజకీయమా అనేది ముందు ముందు తేలే చాన్స్ ఉంది.