టీఆర్ఎస్లోకి పదవులు ఆశ చూపి తెచ్చుకున్న సీనియర్లు ఇప్పుడు ఆదరణ లేక ఆదే రేంజ్లో షాకిచ్చి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. పాలేరులో కార్యకర్తలు.. అనుచరులతో సమవేశమైన తుమ్ల.. ఏ క్షణమైన పిడుగులాంటి వార్త వినాల్సి వస్తోంది.. కార్యకర్తలు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. పాలేరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అవసరమైతే పార్టీ మారి అక్కడ నుంచి తప్పనిసరిగా పోటీ చేయాలని దృక్పథంతో ఉన్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి తుమ్మల ఓడిపోయారు. అక్కడ గెలిచిన కందాళ ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. చేరిక ఒప్పందం ప్రకారం టిక్కెట్‌ను ఆయనకే కేటాయించాల్సి వస్తుంది. అదే జరిగితే తుమ్మల నాగేశ్వరరావుకు ఎక్కడా టిక్కెట్ కేటాయించలేరు. ఎంపీ సీటు కూడా ఇవ్వలేరు. ఈ కారణంగా ఆయన తన దారి తాను చూసుకోవాలనుకుంటున్నారు. కేసీఆర్ పట్టించుకోకపోవడం కూడా మరో కారణం.
ప్రస్తుతం అసంతృప్త టీఆర్ఎస్ నేతల్ని చేర్చుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. బీజేపీకి కేంద్రంలో అధికారం అడ్వాంటేజ్ ఉంది. కానీ ఖమ్మంలో బీజేపీకి కనీస బేస్ లేదు. అందుకే పార్టీ నేతలు చేరడానికి సంకోచిస్తున్నారు . కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కానీ ఆ పార్టీకి నేతలు లేరు. తుమ్మల ఆ పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే తుమ్మల నాగేశ్వరరావు పార్టీ హైకమాండ్‌కు సంకేతాలు పంపుతున్నారని టిక్కెట్ ఖాయమని సందేశం వస్తే ఆయన టీఆర్ఎస్లోనే ఉంటారని చెబుతున్నారు. మొత్తానికి ఖమ్మంలో అందర్నీ పార్టీలో ఉంచడం కేసీఆర్‌కు అంత తేలిక కాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.